Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
- ప్రారంభమైన కరీంనగర్ జిల్లా 9వ మహాసభ
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ పోరాటం కొనసాగించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా 9వ మహాసభ నగరంలోని సాన అంజయ్య నగర్లో (కామ్రేడ్ కె.వేణుగోపాల్‌రావు ప్రాంగణం) ఆదివారం ప్రారంభమయ్యాయి. మహాసభల ఆహ్వాన సంఘం చైర్మెన్ ఎన్.లక్ష్మీకాంతం జెండా ఆవిష్కరణ చేశారు. అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రారంభసభలో వీరయ్య మాట్లాడారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అప్పటినుంచి ఆదానీ, అంబానీలకు దేశ ప్రజా సంపదను పెద్ద ఎత్తున ధారాదత్తం చేస్తుందన్నారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా ప్రభుత్వ ఆస్తులను లీజ్‌ల పేరుతో 99 ఏండ్లు అప్పగిస్తుందని తెలిపారు. రైల్వేలు, విమానాశ్రయాలు, ప్రధాన జాతీయ రహదారులు, ప్రభుత్వ రంగ సంస్థలను పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు విక్రయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా థార్డ్‌వేవ్‌లో కూడా మూడు సూత్రాలు తప్పా శాశ్వత నివారణా చర్యలు తీసుకోవటం లేదన్నారు. ఇప్పటికీ రెండో డోసు పూర్తి చేయలేదని ఆరోపించారు. ప్రజల ప్రాణాలు, అవసరాలు పట్టించుకోకుండా కార్పొరేట్లకు టాక్స్ రాయితీలు, బ్యాంక్ లోన్స్, భూమి మీద ఉన్న ప్రకృతి సంపద అంతా కట్టబెడుతుందని విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి నెల తిరగక ముందే మళ్ళీ అమలు చేస్తామని కేంద్ర మంత్రుల ద్వారా చెప్పిస్తున్నారని అన్నారు. కేంద్ర విద్యుత్ సవరణ చట్టం వల్ల మీటర్ రీడింగ్‌లు పెట్టి పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లాలో విస్తృత ఉద్యమాలు నిర్వహించేలా ఈ మహాసభ తోడ్పడాలనీ, అలాంటి చర్చ జరపాలని కోరారు. మహాసభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్, యు.శ్రీనివాస్, రజినీకాంత్, వాసుదేవరెడ్డి, భీమా సాహెబ్, రాజిరెడ్డి, సంపత్ పాల్గొన్నారు.