Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ చట్టాలు తిరిగి తెస్తామనడం దుర్మార్గం
- కొమురవెల్లి మల్లన్న ఆలయంలో రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు :ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు
నవ తెలంగాణ-కొమురవెల్లి
రైతాంగాన్ని ఆగం చేసేలా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉన్నదనీ, కేంద్రానికి కొమురవెల్లి మల్లన్న జ్ఞానోదయం కలిగించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహౌత్సవానికి హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో కలిసి వెండి తొడుగులతో ఏర్పాటుచేసిన దర్వాజాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. కొమురవెల్లి మల్లన్న దయతో ప్రాజెక్టులన్నీ పూర్తి చేశామన్నారు. మల్లన్న ఆలయాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో పాటు ప్రాజెక్టులకు మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌గా పేర్లు పెట్టి తన భక్తిని చాటుకున్నారని కొనియాడారు. వచ్చే ఏడాది కల్యాణం నాటికి స్వామి వారికి బంగారు కిరీటాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామన్నారు. రైతులు ఏడాది పాటు పోరాడి రద్దు చేసుకున్న రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను.. తిరిగి తీసుకొస్తామని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అనడం దేశ రైతాంగాన్ని అవమానపరచడమేనని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల కోసమే వ్యవసాయ చట్టాలను రద్దు చేశారేమో అనే అనుమానం కలుగుతున్నదన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్లన్న కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయ అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఎర్రోల్ల శ్రీనివాస్, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాప్, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.