Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మంచిర్యాల జిల్లా రెండో మహాసభలో రాష్ట కమిటీ సభ్యులు బండారు రవికుమార్
నవతెలంగాణ-మంచిర్యాల
ఖనిజ, సహజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల ప్రయివేటీకరణకు సిద్ధం కావడం ప్రమాదకర చర్య అని సీపీఐ(ఎం) రాష్ట కమిటీ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లారీ ట్రాన్స్పోర్ట్ హాల్లో ఆదివారం సీపీఐ(ఎం) జిల్లా రెండో మహాసభలు ప్రారంభమయ్యాయి. మహాసభల్లో బండారు రవికుమార్ పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా పరిపాలిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రయోజనాల కోసం ఉన్న విలువైన జాతీయ ఆస్తులను అమ్ముకోవడం దేశద్రోహమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామనీ, విదేశాల్లోని నల్లధనాన్ని బయటకు తెస్తామని ప్రగల్భాలు పలికి, ప్రస్తుతం దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. అనేక చట్టాలను మారుస్తూ ప్రజల హక్కులను కాలరాస్తోందరి విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్యుడి బతుకు భారంగా మార్చిందన్నారు. మరో వైపు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన కూడా ప్రజావ్యతిరేకంగా సాగుతోందని విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉన్నా ఆ దిశగా పాలకులు కృషి చేయడం లేదన్నారు. ఇది స్థానిక ప్రజాప్రతినిధుల, ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని చెప్పారు. రైతులు, కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా మహాసభలో కార్యాచరణ రూపొందించి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మహాసభ ప్రారంభసభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బొజ్జ భిక్షమయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణ శంకర్, సీపీఐ(ఎం) ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు లంక రాఘవులు, సత్యనారాయణ, కమలకుమారి, జిల్లా కార్యదర్శి సంకె రవి, తదితరులు పాల్గొన్నారు.