Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 317తో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి
- భార్యాభర్తలు, సీనియారిటీపై అప్పీళ్లను పరిష్కరించాలి
- పరస్పర బదిలీలకు అవకాశమివ్వాలి
- ఎస్ఏ పోస్టును జోనల్ క్యాడర్‌గా మార్చాలి : యూఎస్పీసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జోనల్ పద్ధతిలో ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 28న(మంగళవారం) సచివాలయాన్ని ముట్టడించనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యుఎస్పీసీ) పిలుపునిచ్చింది. ఆదివారం వర్చువల్ పద్ధతిలో యుఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కె.జంగయ్య, చావ రవి(టీఎస్‌యూటీఎఫ్), మైస శ్రీనివాసులు(టీపీటీఎఫ్్), ఎం రఘుశంకర్ రెడ్డి, టి లింగారెడ్డి(డీటీఎఫ్), యు పోచయ్య, డి సైదులు (ఎస్టీఎఫ్), సయ్యద్ షౌకత్ అలీ, ఎన్ చెన్నరాములు(టీఎస్ పీటీఏ), జాడి రాజన్న(ఎస్సీ ఎస్టీటీఏ), ఎన్ యాదగిరి (బీటీఎఫ్), ఎ గంగాధర్(టీపీఎస్ హెచ్ఎంఏ), ఎస్ హరికష్ణ(టీటీఏ), చింతా రమేష్(టీఎస్ ఎస్సీఎస్టీయుఎస్), టి విజయ సాగర్( టీజీ పీఈటీఏ), బి కొండయ్య, ఎస్ మహేష్(టీఎస్ ఎంఎస్టీఎఫ్), తాహెర్ (ఏపీయూటీఏ) పాల్గొన్నారు.
నూతన జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులో స్థానికతను విస్మరించి వేలాది మంది ఉపాధ్యాయులను వారి స్వంత జిల్లాల నుంచి బలవంతంగా వేరే జిల్లాలకు కేటాయించటాన్ని నిరసిస్తూ, బలవంతపు బదిలీలకు బలి అయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని యుఎస్పీసీ సమావేశం డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా జిఓ 317ను విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ఉద్యమానికి, ఆవిర్భావానికి మూలమైన స్థానికత ప్రస్థావనే జీఓలో లేకపోవటం, ఉపాధ్యాయులు సొంత జిల్లాలను వదిలి బలవంతపు బదిలీతో వేరొక జిల్లాలో స్థానికేతరులుగా శాశ్వతంగా పనిచేయాల్సి రావటం దురదష్టకరమని పేర్కొంది. ఉపాధ్యాయ సంఘాలతో విద్యామంత్రి జరిపిన సమావేశంలో ఒక్క సంఘం మినహా అన్ని సంఘాలూ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ ఏ ఒక్క అంశాన్నీ పరిగణనలోకి తీసుకోకుండా ఏక పక్షంగా వ్యవహరించటం అన్యాయమని తెలిపింది.
పలు జిల్లాల్లో భార్యాభర్తల, సీనియారిటీ జాబితాల తయారీలో అవకతవకలు చోటుచేసుకున్నాయనీ, జిల్లాల కేటాయింపుల్లో పలువురికి తీవ్ర అన్యాయం జరిగిందనీ ఆరోపించింది. దీనిపై అప్పీల్ చేసుకోవాలని చెబుతూనే సమస్య పరిష్కారం కాకుండా పాఠశాలల కేటాయింపు ఎలా జరుపుతారని ప్రశ్నించింది. పరస్పర బదిలీలకు అవకాశం ఇస్తామనీ, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ జోనల్ క్యాడర్‌గా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గారు రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ప్రకటించి అందుకు సంబంధించిన ఉత్తర్వులేవీ ఇవ్వలేదని తెలిపింది. వేసవిలో సాధారణ బదిలీల సందర్భంలో పాఠశాలల కేటాయింపు ఉంటుందని నమ్మబలికి ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన పాఠశాలల కేటాయింపు చేయడం అన్యాయమని పేర్కొంది. తద్వారా కొత్త జిల్లాలో స్టేషన్ సీనియారిటీ, సర్వీసు సీనియారిటీ నష్టపోతారని వాపోయింది. ఈసమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు సీఎస్, విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలని కోరినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించింది. వాస్తవికతతో సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. జీఓ నెం. 317 వల్ల అన్యాయానికి గురైన ఉపాధ్యాయులు అందరూ కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ పెద్దసంఖ్యలో సచివాలయం ముట్టడికి తరలిరావాలని పిలుపునిచ్చింది.