Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌష్టికాహారాన్ని అందించటంలో వైఫల్యం: వెబినార్లో మరియం ధావలే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాలికల వివాహ వయస్సును 18ఏండ్ల నుంచి 21ఏండ్లకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంలో కపటత్వం ఉందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ఆరోపించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో '' పెళ్లి వయస్సు పెంపులో మతలబేంటి?'' అనే అశంపై ఎస్వీకే కార్యదర్శి ఎస్ వినరుకుమార్ సమన్వయంతో వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మరియం మాట్లాడుతూ ఈ చర్య మహిళా సాధికారతను అడ్డుకునేదిగా కనిపిస్తోందని వ్యాఖ్యా నించారు. ప్రజల మౌలిక పోషకాహార, విద్యా, ఉపాధి అవసరాలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైన పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కపటనీతి తప్ప మరొకటి కాదని విమర్శించారు. వాస్తవానికి ఈ చర్య వల్ల ప్రతికూల ఫలితాలే వుంటాయని చెప్పారు. తమకిష్టమైనవారిని పెండ్లి చేసుకునే ఐచ్ఛిక వివాహాలను మరింత లక్ష్యంగా పెట్టుకోవడానికే ఈ వివాహ వయస్సు పరిమితి పెంపుని తెలిపారు. తనకిష్టమైన వారిని పెండ్లి చేసుకోవడానికి ఇప్పటికే తీవ్ర అడ్డంకులు ఎదుర్కొంటున్న యువతి లైంగికతను నియంత్రించేందుకు ఇదొక మార్గంగా వుంటుందన్నారు. లింగ సమానత్వం కోసం మహిళల వివాహ వయస్సును పెంచుతున్నామని చేస్తున్న వాదన పూర్తిగా తప్పేనన్నారు. ఐసీడీఎస్, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి పోషకాహార కార్యక్రమాలకు తగినన్ని వనరులు కేటాయించడానికి తిరస్కరిస్తున్న ప్రభుత్వం, వాటినుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు అనుసరిస్తున్న ఎత్తుగడ ఇదని స్పష్టమవుతోందని విమర్శించారు. పుట్టినప్పటి నుంచి ఆడపిల్లల పోషకాహార పరిస్థితులు సరిగా లేనపుడు 21ఏండ్లకు వివాహం చేసుకుని ఆ తర్వాత పిల్లలకు జన్మనిచ్చినా తల్లీ, పిల్లల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడబోవని వివరించారు. వ్యక్తిగత సంబంధాల విషయంలో మహిళా సాధికారత ఉండాలని ప్రభుత్వం అంతగా కోరుకుంటే కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేక చట్టం చేయవచ్చుకదా? అని ప్రశ్నించారు. గృహహింసం చట్టాన్ని ఎందుకు నీరుగారుస్తున్నారో చెప్పాలన్నారు. 18 సంవత్సరాల వయస్సులో ఒక మహిళ వయోజనురాలిగా పరిగణింపబడుతుందన్నారు. క్రిమినల్ చట్టాలతో సహా వయోజనులకు వర్తించే అన్ని చట్టాలూ పద్దెనిమిదేండ్ల వయస్సు ఉన్న మహిళలకూ వర్తిస్తాయని గుర్తుచేశారు. ఆమె చేసే ఏ పనికైనా ఆమే బాధ్యురాలవుతుందని చెప్పారు. 18 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉన్న మహిళ నేరం చేసినట్లయితే ఆమెను వయోజనులుండే కారాగారం లోనే పెట్టి శిక్ష విధించవచ్చన్నారు. కానీ ఈ ప్రతిపాదిత బిల్లులో మాత్రం ఆమె పెండ్లి చేసుకునే విషయంలో చిన్న వయస్కురాలుగా పరిగణిం చబడుతోందన్నారు. ఇది మహిళా సాధికారత ఎంత మాత్రం కాదన్నారు. మహిళలకు పసితనాన్ని ఆపాదించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. వయోజనులైన యువ జంటలు తరచుగా కుల మతాల అడ్డుగోడ లను దాటి ఐచ్ఛిక వివాహాలు చేసుకోవడాన్ని ఇది చట్ట విరుద్ధంగా మార్చుతుందని చెప్పారు. ప్రస్తుతం ఒక వయోజనురాలైన యువతి చట్టబద్ధంగా తన ఇష్ట ప్రకారం భాగస్వామిని ఎంచుకునే స్వయం ప్రతిపత్తి సూత్రానికి ఈ బిల్లు విరుద్ధమని తెలిపారు. అంతేకాక న్యాయపరమైన సూత్రాలకు కూడా విరుద్ధంగా వుంటుందని తెలియజేశారు. యువతులు తమకిష్టమైన నిర్ణయాలను తీసుకొనే సామర్థ్యాలను పెంచే వాతావరణం కల్పించాలంటే వారికి సరైన విద్యా సౌకర్యాలు, ఉపాధి అవ కాశాల హామీ కల్పించడం కీలకమన్నారు. ఇది ఎంత అహేతుకమైన విషయ మంటే... ఒక వైపు మహిళల సంతాన సాఫల్యత తగ్గుతుండగా కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జనాభాను నియంత్రించటానికి క్రూరమైన చట్టాలను ప్రతిపాదించడం లాంటిదేనని గుర్తుచేశారు. ఆడపిల్లలకు ఉన్నత విద్యా సౌకర్యాలు కల్పిస్తున్న కేరళ లాంటి రాష్ట్రాలు బాల్య వివాహాలను చాలా విజయవంతంగా అరికట్టగలి గాయని గుర్తుచేశారు. పౌష్టికాహార లోపం, మాతా శిశు మరణాలు లాంటి ముఖ్యమైన సమస్యలు రాజకీయ విధానాలకు సంబంధించిన విషయాలని చెప్పారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి సంబంధించిన నిధులను తగ్గిస్తూ, ఆరోగ్య రంగాన్ని ప్రయివేటు పరం చేస్తోందని విమర్శించారు. మరియం ధావలే ఉపన్యాసాన్ని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సమీనా అఫ్రొజ్ అనువాదం చేశారు.