Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాసంగిలో వరి మీరేలా వేశారు
- కొనబోమన్నారు...మీరెక్కడ అమ్ముతారో చెప్పండి : సీఎం కేసీఆర్‌కు రేవంత్ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరి వేస్తే రైతులకు ఉరి అని ప్రబోధించిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలోని 150 ఎకరాల్లో వరి సాగు ఎలా చేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.నీతులు ప్రజలకేనా? సీఎంకు వర్తించవా? అని నిలదీశారు. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవనీ, కొనుగోలు చేయబోమంటూ ప్రకటించిన సీఎం... ఆయన పొలంలో పండిన ధాన్యాన్ని ఎక్కడ అమ్ముతారో చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడే రైతులు కూడా అమ్ముకుంటారని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయ పార్టీ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, మానవతారారు, అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ వరి సాగు చేసిన ఫోటోలు, వీడియోలను మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి పొలం పచ్చగా ఉండాలి..ప్రజలు మాత్రం ఉరేసుకోవాలా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సోమవారం మీడియాకు ప్రత్యక్షంగా చూపించనున్నట్టు తెలిపారు. 'తనకొన్యాయం, ప్రజలకో న్యాయమా? రైతులు వరి వేయాలనీ, ఆ పంటను ఎలా కొనదో నేను చేస్తా' అని హెచ్చరించారు.
చట్టాలు మళ్లీ తెస్తే టీఆర్ఎస్ ఎటువైపో చెప్పాలి
సూటు...బూటు ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని రేవంత్ విమర్శించారు. రైతులకు క్షమాపణ చెప్పి చట్టాలు వెనక్కి తీసుకుని...మళ్ళీ చట్టాలు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ చట్టాలు తీసుకొస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువైపు ఉంటుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర ప్రకటించిన 23 పంటలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కొనాల్సిందేనన్నారు. ఇతర రాష్ట్రాల్లో నేరుగా కేంద్ర ప్రభుత్వమే పంట కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొని కేంద్రానికి అమ్ముతున్నదనీ, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గోస పట్టించుకోకుండా రాజకీయ క్రీడ ఆడుతున్నాయని చెప్పారు. మద్దతు ధర ప్రకటించిన పంటలు కొనకపోతే ప్రభుత్వంపై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. చత్తీస్ఘడ్ రాష్ట్రప్రభుత్వం క్వింటాల్ వరికి రూ 2540కు కొనుగోలు చేస్తున్నదని గుర్తు చేశారు. చిరుధాన్యాల సాగుదారులకు అక్కడి ప్రభుతం ఎకరాకు రూ 9వేల బోనస్ ఇస్తున్నదని చెప్పారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ వెళ్లి అక్కడి విధానాన్ని తెలుసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, మిల్లర్లు కుమ్మక్కైయి రైతులను ఇబ్బందులకు పెడుతున్నారని చెప్పారు. నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దాసోహమైందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.