Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతలు స్వాతంత్య్ర ఉద్యమంలోనే పాల్గొనలేదు
- మతం పేరుతో ఓట్లను కొల్లగొట్టే కుట్రలో బీజేపీ :సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అతుల్‌కుమార్ అంజాన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కమ్యూనిస్టులను మించిన దేశభక్తులు లేరనీ, తమ నుంచి దేశభక్తిని నేర్చుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అతుల్ కుమార్ అంజాన్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులను బ్రిటీష్ ప్రభుత్వం అణచివేసిందనీ, అక్రమ కేసులతో పది నుంచి ఇరవై ఏండ్ల పాటు జైల్లో బంధించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశభక్తి పార్టీగా చెప్పుకునే బీజేపీ నేతలెవ్వరూ ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదని తెలిపారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో గల మగ్దూం భవన్లో సీపీఐ 97వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిం చారు. అంతకుముందు సీపీఐ జెండాను అతుల్ కుమార్ అంజాన్ ఆవిష్కరించారు. ఈ సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కందిమళ్ల ప్రతాప్‌రెడ్డిని అతుల్ అంజాన్, జైని మల్లయ్య గుప్తాను సయ్యద్ అజీజ్ పాషా, ఏటుకూరి ప్రసాద్, అతుల్‌లను చాడ వెంకట్ రెడ్డి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా అతుల్ కుమార్ అంజాన్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని నినదించిన మొట్టమొదటి పార్టీ సీపీఐ అన్నారు. స్వాతంత్య్రం తర్వాత జైలు నుంచి విడుదలైన 450 మంది నాయకులు సీపీఐలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్, ఎంఐఎంలతో దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. దేశ ఐక్యతకు విఘాతం కలిగించే శక్తులను తరిమికొట్టి దేశాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. పుట్టగొడుగుల్లా రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయనీ, ఆ పార్టీలకు తండ్రీ తల్లి ఎవరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. దుస్తులు మార్చినంత సులువుగా పార్టీలు మారడం నేతలకు ఫ్యాషన్‌గా మారిందని విమర్శించారు.
సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహారిస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీలు లేకుండా చేసేందుకు కార్పొరేట్ శక్తులతో బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నదని విమర్శించారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షకు తాము నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. పోరాడితే విజయం తప్పదని రైతుల పోరాటం నిరూపించిందన్నారు. పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ తర్వాత అంత సుదీర్ఘ చర్రిత సీపీఐకే ఉందన్నారు. కందిమళ్ల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు నేతల త్యాగాలను స్మరించుకుని, కర్తవ్యాలను ఎంచుకుని ముందుకు సాగాలని యువతకు సూచించారు. జైని మల్లయ్య గుప్తా మాట్లాడుతూ గాంధీని చంపిన వారి రాజకీయ వారసులే నేడు అధికారంలో ఉన్నారని విమర్శించారు.
97 మీటర్ల జెండా.. 97 ఎర్రజెండాలతో భారీ ప్రదర్శన
సీపీఐ హైదరాబాద్ జిల్లాకమిటీ 97మీటర్ల అరుణ పతాకం, 97 ఎర్రజెండాలను చేతబూని భారీ ప్రదర్శన నిర్వహించారు. నారాయణగూడలోని సత్యనారాయణ భవన్ నుంచి హిమాయత్ వరకు ఈ ప్రదర్శన సాగింది. ప్రజా నాట్య మండలి కళాకారుల బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ, వీఎస్.బోస్, ఎన్.బాలమల్లేష్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ టి.నరసింహా, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలుమాకుల జంగయ్య, మేడ్చల్ జిల్లా కార్యదర్శి డీజీ సాయిలుగౌడ్, ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.