Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బూస్టర్ డోసుకు
పరుగు
ొ సిబ్బంది తక్కువ.. పని భారం ఎక్కువ
ొ కోవిడ్ టైంలో ఎంపికైన వారిని ఊడబీకిన సర్కారు
ొ అవసరాలకు తగినట్టు నియమకాలు పెంచాలంటున్న సిబ్బంది
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా భయాందోళనలు మళ్లీ పుంజుకున్నాయి. వాటిని పోగెట్టేందుకు ప్రభుత్వ చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఇదే క్రమంలోనూ రెండో డోసు ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైంది. అప్పుడే బూస్టర్ డోసు కోసం పరుగులు పెడుతున్నది. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బందిలో అసంతృప్తి మొదలైంది. కరోనాను ఎదుర్కొనేందుకు సిబ్బంది పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. దీంతో పాటు సిబ్బంది కొరత వెంటాడుతున్నది. ఇది సిబ్బందిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నది. గతంలో కరోనా విధుల కోసం తీసుకున్న సిబ్బందిని తొలగించి ప్రభుత్వం తప్పు చేసింది. ఉన్న సిబ్బందిపై పని భారాన్ని మరింతగా మోపేందుకు సిద్దమవుతున్నది. దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన కొనసాగుతున్నది. రాష్ట్రంలో అర్హులైన వారందరికి డిసెంబర్ 31 నాటికి రెండు డోసులు వేయటం పూర్తి చేస్తామని అమాత్యులు సెలవిచ్చారు. ఏడాది ముగిసేందుకు ఐదు రోజులే మిగిలి ఉండగా ఒక కోటి 76 లక్షల మంది మాత్రమే రెండో డోసు తీసుకున్నారు. ఈ నెల 23 నాటికే వంద శాతం మందికి మొదటి డోసు ఇవ్వటం పూర్తయింది. రాష్ట్రంలో వ్యాక్సిన్‌కు అర్హులుగా 18 ఏండ్లు పైబడిన 2.77 కోట్ల మంది ఉన్నారు. వారందరికీ వ్యాక్సిన్ పూర్తి కాకముందే జనవరి మూడు నుంచి 15 నుంచి 18 ఏండ్ల మధ్య పిల్లలకు, జనవరి 10 నుంచి హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి బూస్టర్ డోసు వేయాలని కేంద్రం నిర్ణయించింది. రెండు దఫాలుగా కరోనా విరుచుకుపడిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ టీకా వేయటం వేగవంతం చేయాలని సూచించింది.
సిబ్బందిపై పని భారం
లక్ష్యాన్ని చేరుకునేందుకు పూర్తిగా ఆరోగ్య సిబ్బందిపైనే భారం వేయటం కూడా సకాలంలో పూర్తి కాకపోవటడానికి కారణమైంది. క్షేత్రస్థాయిలో ఉన్న ఏఎన్ఎంలు, సెకెండ్ ఏఎన్ఎంలు, నర్సులు, ఆశావర్కర్లు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తో పాటు రెగ్యులర్ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలతో సతమతమవుతున్నారు. దీనికి తోడు జనవరిలో ఐదేండ్ల లోపు చిన్నారులకు పల్స్ పోలియో నిర్వహించాల్సి ఉంటుంది. ఇతర ఆరోగ్య పథకాలు, కార్యక్రమాలు కూడా క్రింది స్థాయిలో ఉన్న సిబ్బందే విజయవంతం చేయాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఉన్న సిబ్బంది సరిపోక కొత్తగా నియామకాలు చేపట్టారు. భవిష్యత్తు ప్రమాదాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నపళంగా వెయ్యి మందికి పైగా నర్సులను సర్కారు తొలగించటం విమర్శలకు దారి తీసింది.
నలుగుతున్న సిబ్బంది...
అధికారులు వ్యాక్సిన్ డబ్బాలను చేతికిస్తున్నారు. గడువు తీరిన వారం దరికీ వ్యాక్సినేషన్ వెంటనే పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశిస్తున్నారు. అయితే ససేమిరా రెండో డోసు తీసుకోవద్దని నిర్ణయించుకున్న వారు ఆరోగ్య సిబ్బందికి దొరకకుండా తప్పించుకుంటున్నారు. మొదటి డోసు తీసుకున్న వారిలో కేవలం 65 శాతం మంది మాత్రమే రెండో డోసు తీసుకోవటం, అందులోనూ దాదాపు 25 లక్షల మంది గడువు తీరినా ముందుకు రాకపోవటం తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన మేరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం లేదనే విమర్శలున్నాయి. తక్షణమే సిబ్బందిని పెంచడంతో పాటు వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న జిల్లాలు, ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజాసంఘాలు కోరుతున్నారు.