Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజయ్ ది సిగ్గులేని దీక్ష
- సమాధానం చెప్పాలి : బీజేపీకి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ది నిరు ద్యోగ దీక్ష కాదనీ సిగ్గులేని దీక్షలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు విమర్శించారు. సోమవారం ఇందిరాపార్కు వద్ద బండి సంజయ్ చేపట్టనున్న నిరుద్యోగ దీక్షపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న సంగతి ఎటుపోయేనో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ దీక్ష కాదనీ అవకాశవాద దీక్ష అని ఎద్దేవా చేశారు. ఆయన తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమేనని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ యువతకు ఏం చేసిందో, ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చారో లెక్క చెప్పే దమ్ముందా? అని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్ర యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది ఐటీ ఉద్యోగాలకు గండి కొట్టి, యువత నోట్లో మట్టికొట్టి, మళ్లీ సిగ్గు లేకుండా నిరుద్యోగ దీక్షలకు దిగుతారా? అంటూ విమర్శించారు. బీజేపీ దొంగ దీక్షలను, నిరుద్యోగుల పట్ల వారికున్న కపట ప్రేమను చూసి అవకాశవాదమే సిగ్గుపడుతున్నదని పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ బీజేపీ ప్రచారం చేసిందనీ, కానీ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా సాయమందలేదని గుర్తు చేశారు. దేశంలో గత 40ఏండ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం పెరిగిందనీ, కేంద్రం ఎన్ని ఉద్యోగాలిచ్చిందో శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేశారు. నిజంగా సంజయ్ కి చిత్తశుద్ధి ఉంటే దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదనీ, ఢిల్లీలోని జంతర్ మంతర్ సెంటర్లో చేయాలని సూచించారు. హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించలేదనీ, చేతకానితనంపై బండి సంజరు ఇందిరాపార్కు సాక్షిగా ముక్కునేలకు రాసి ప్రజలకు వివరణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.