Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పురపాలికల్లో పాలన పడకేసింది. కాగితాల్లో అత్యద్భుతంగా కనిపిస్తున్న పాలన క్షేత్రస్థాయిలో లేదు. రాష్ట్రంలోని 141 మున్సిపాల్టీల్లో 64 ఈ ఏడాదిలో ఏర్పాటయినవే. ఆర్భాటంగా మున్సిపాల్టీలు ప్రకటించారే తప్ప, అక్కడి పాలనపై పట్టు ఇప్పటికీ రాలేదు. కేవలం పట్టణాల సంఖ్యను పెంచడం, తద్వారా ఆదాయమార్గాలను పెంచుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. పాత పంచాయతీ కార్యాలయాలే ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులుగా మారాయి.
మౌలికసౌకర్యాలు కరువు
పాత, కొత్త మున్సిపాల్టీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు అందుబాటులో లేవు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయడమే అనే ధోరణినే ప్రభుత్వం అమలు చేస్తున్నది.
వ్యర్థాల నిర్వహణ
తడి, పొడి ఘన వ్యర్థాల నిర్వహణ క్షేత్రస్థాయిలో ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. అనేక మున్సిపాల్టీల్లో డంపింగ్ యార్డుల సమస్య అలాగే ఉంది.
సమీకృత మార్కెట్లు
ప్రతి మున్సిపాల్టీ పరిధిలోనూ సమీకృత మార్కెట్లు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. అనేక చోట్ల ఇప్పటికీ స్థల సేకరణే జరగలేదు. ఈ మార్కెట్లు ఏర్పాటైతే స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. కార్యరూపంలోకి రాలేదు.
నిధులేవీ?
పురపాలికల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన నిధులు లేవు. ఆస్తిపన్ను, నీటిపన్ను, ప్రకటనల ఆదాయం, ఇంధన పొదుపు వంటి చర్యలతో పాలనను నెట్టుకురావల్సి వస్తున్నదని పలు మున్సిపాల్టీల కమిషనర్లు చెప్తున్నారు. కేంద్రం నుంచి రావల్సిన గ్రాంట్లు, ఇతర నిధులు నేరుగా మున్సిపాల్టీలకు కాకుండా, రాష్ట్ర ఖజానాకే జమ అవుతున్నాయి. దీనితో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపైనే పురపాలికలు ఆధారపడాల్సి వస్తున్నాయి.
రుణాలు లేవు
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో పేదలకు ఆర్ధిక సహకారాన్ని అందించే కార్యక్రమాల అమలు నిలచిపోయింది. గతంలో స్వయం సహాయక బృందాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు వాటిని పూర్తిగా నిలిపివేశారు.
వీధి వ్యాపారుల గోస
మున్సిపాల్టీల పరిధిలోని వీధి వ్యాపారుల లెక్కలు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. జీహెచ్ఎంసీ మినహాయించి, 141 మున్సిపాల్టీల్లో వీధి వ్యాపారుల సంఖ్య కేవలం 85వేల మంది మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 74వేల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పించలేదు. ఇప్పటికీ వీధి వ్యాపారులు రోజువారీ ప్రయివేటు ఫైనాన్షియర్ల నుంచే రుణాలు తీసుకొనే దుస్థితి నెలకొని ఉంది.
పారిశుద్ధ్యం
మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్యం ఇప్పటికీ ఔట్సోర్సింగ్ ద్వారానే జరుగుతున్నది. ఖాళీ పోస్టుల భర్తీ లేదు. పారిశుద్ద్య కార్మికులకు కనీస వేతనాలు లేవు. వీటి సాధన కోసం పురపాలక సంఘ కార్మికులు పలు ఆందోళనలు చేపట్టారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అక్కడ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇప్పటికీ పలు రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఉపాధి అవకాశాలు పెరగలేదు. పురపాలకశాఖలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా జరగలేదు. ఇక్కడా ఔట్సోర్సింగ్ వ్యవస్థే ఇక్కడ అమల్లో ఉంది.
అమల్లో లేని టీఎస్‌బీపాస్
భవన నిర్మాణ అనుమతుల్లో అధికారుల ప్రత్యక్ష ప్రమేయాన్ని తగ్గించి, అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలనే ప్రభుత్వ ఆలోచన కార్యరూపంలోకి రాలేదు. టీఎస్‌బీపాస్ పేరుతో ఆర్భాటంగా ఈస్కీంను ప్రకటించారు. కేవలం 15రోజుల్లో అన్ని శాఖల నుంచి అనుమతులు సింగిల్‌విండో ద్వారా ఇచ్చేస్తామని చెప్పారు.కానీ పురపాలికల్లో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి.
పన్ను పరిధిలోకి...
కొత్త మున్సిపాల్టీలు ఏర్పడ్డాక పన్ను పరిధిలోకి వచ్చే నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించారు. దాదాపు లక్షకు పైగా నిర్మాణాలను గుర్తించారు. వాటన్నింటికీ ఆస్థిపన్ను విధించారు. అలాగే ఖాళీస్థలాలపై పన్నును కూడా వసూలు చేస్తున్నారు.
కార్పొరేషన్లకు ప్రజారవాణా
ఆర్టీసీ బస్సుల నిర్వహణను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్లే ప్రజారవాణాను నిర్వహించాలని పురపాలకశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై వివాదం కొనసాగుతూనే ఉంది.తమకు ప్రజారవాణా బాధ్యతలు తమకు వద్దని జీహెచ్ఎంసీ పాలకమండలి ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. దీనితో ఈ నిర్ణయం అమలుపై ప్రతిష్టంభన ఏర్పడింది.
పట్టణ ప్రగతి
పురపాలికల్లో రోజు వారీగా చేసే పనుల్నే పట్టణ ప్రగతి పేరుతో అమలు చేస్తున్నారు. కాగితాల్లో కొత్తగా అనేక స్కీంలను ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో అవేవీ ఇప్పటికీ అమల్లోకి రాలేదు.
అక్రమ నిర్మాణాలు
కొత్త మున్సిపాల్టీల ప్రకటనతో రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతులు లేని భవనాలను కూల్చేయాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అయితే పలుచోట్ల రికార్డుల నిర్వహణ కోసం ఒకటి రెండు కూల్చివేతలు చేపట్టి, చర్యలు తీసుకున్నామని రాసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎల్ఆర్ఎస్ తప్పనిసరి
అన్ని మున్సిపాల్టీల్లోనూ ఎల్ఆర్ఎస్ను తప్పనిసరి చేశారు. భవన నిర్మాణ అనుమతికి వెళ్తే, ఎల్ఆర్ఎస్ చార్జీలను కూడా కట్టించుకుంటున్నారు. సామాన్య ప్రజలకు ఇవి తీవ్ర ఆర్థిక భారాలుగా మిగులుతున్నాయి.