Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 317 జీవోతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో మనోవేదన
- స్థానికత లేకుండానే శాశ్వత కేటాయింపులు
- ఏకపక్షంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం
- వయోపరిమితి 61 ఏండ్లకు పెంపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జోనల్ విధానం ప్రకారం కొత్త జిల్లాల వారీగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ అంతా అయోమయంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6న జారీ చేసిన జీవోనెంబర్ 317 వారిలో అలజడి రేకెత్తించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించింది. స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం సీనియార్టీకి ప్రాధాన్యత ఇవ్వడంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ ఏడాది పీఆర్సీ అమలైనా, ఫిట్మెంట్ పెరగడంతో కొంత ఉపశమనం కలిగింది. అయినా 317 జీవోతో వారి ఆశలు ఆవిరయ్యాయి. అభ్యంతరాలున్నాయని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సంఘాలు ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా పట్టించుకునే పరిస్థితి కరువయ్యింది. ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తప్పులతడకగా సీనియార్టీ జాబితాలు
ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపులకు సంబంధించి ముందుగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా ఆయా శాఖల అధికారులు సీనియార్టీ జాబితాలు రూపొందించాలి. అందరికీ అందుబాటులో ఉంచాలి. ఆ తర్వాత అభ్యంతరాలను స్వీకరించాలి. ఫిర్యాదుల్లే వని నిర్ధారించిన అనంతరమే తుది సీనియార్టీ జాబితాను రూపొందించాలి. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఇంకా గందరగోళంగానే ఉన్నది. అధికారులు తప్పులతడకగా సీని యార్టీ జాబితాలు రూపొందించినట్టు విమ ర్శలు వస్తున్నాయి. వాటిని సవరించకుండానే ముందుకెళ్లడంపై ఉపా ధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భార్యాభర్తలు ఒకే జిల్లాలో ఉంటారా?
జీవో నెంబర్ 317 ప్రకారం భార్యాభర్తలు (స్పౌజ్) ఒకే జిల్లాలో పనిచేసే అవకాశం లేదు. తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి స్పౌజ్ సమస్యను పరిష్కరించాలన్న డిమాండ్ ఉన్నది. ఒకే జిల్లాలో పనిచేసే అవకాశం కల్పించాలని వారు అనేక ఉద్యమాలు చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. కానీ ఇప్పుడు సమస్య మళ్లీ మొదటికొచ్చింది. కొత్త జిల్లా, జోన్, మల్టీజోన్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేరిన తర్వాతే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఒకే జిల్లాలో పనిచేస్తారని స్పష్టత ఇవ్వకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
పీఆర్సీ అమలైనా నిరాశే
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్సీ వర్తింపచేసినా నిరాశలోనే ఉన్నారు. ఈ పీఆర్సీ 2018, జులై ఒకటి నుంచి అమలు కావాలి. కానీ 2020, ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కల్పిస్తామని ప్రకటించింది. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులు 21 నెలలపాటు ఈ పీఆర్సీ ప్రకారం ఆర్థిక ప్రయోజనం నష్టపోయారు. 2020, ఏప్రిల్ ఒకటి నుంచి 2021, మార్చి 31 వరకు 12 నెలల బకాయిలు ఉద్యోగ విరమణ సమయంలో చెల్లిస్తామని ప్రకటించడంపై అసంతృప్తితో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే బకాయిలను 2022, మార్చి 31లోపు ఇస్తామని ప్రకటించింది. జూన్ నుంచి వేతనాలు పెరిగాయి. జులై నుంచి పెరిగిన జీతాన్ని తీసుకుంటున్నారు. ఇక ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ) శ్లాబ్‌లను తగ్గించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2018, జులై ఒకటి తర్వాత కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ఈ పీఆర్సీని వర్తింపచేయలేదు. దీంతో కొత్త ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు.
సొంత జిల్లాకు స్థానికేతరులుగా వేలాది మంది
ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియతో వేలాది మంది సొంత జిల్లాకే స్థాని కేతరులుగా మారే ప్రమాదమున్నది. వారి జననం, నివాసం, చదువును పరిగణనలోకి తీసుకోకుండా ఈ ప్రక్రియను చేపడుతుండడంతో స్థానికత ప్రశ్నార్ధకంగా మారనుంది. ఇంతకాలం వారి చదువు ఆధారంగా స్థానికత ఒక జిల్లాలో ఉంటే ఇప్పుడు కేటాయింపుల ఆధారంగా మరో జిల్లాకు స్థానికులుగా మారబోతున్నారు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మానసికంగా కుమిలిపోతున్నారు.
ఉద్యోగుల వయో పరిమితి 61 ఏండ్లు
ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయో పరిమితిని 58 నుంచి 61 ఏండ్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె రామకృష్ణారావు జీవో నెంబర్ 45ను విడుదల చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ ఈ నిబంధనలు వర్తించాయి. మార్చి నుంచి రాష్ట్రంలో ఉద్యోగ విరమణల్లేవు. 2024, మార్చి నుంచి ఉద్యోగుల ఉద్యోగ విరమణలుంటాయి.