Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సాగునీటి ప్రాజెక్టుల అప్పగింత విషయంలో కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఆదేశాలను అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నది. ప్రాజెక్టుల నిర్వహణ కోసం కేంద్రమడిగిన నిధులను సమకూర్చే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. సాగునీటి వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పునర్విభజన చట్టం పరిధిలోనే జలవివాదాలను పరిష్కరించాల్సి ఉంది. ఇందుకు గతంలో ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్ ప్రయోజనం కలగలేదు. మరో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇంకా రానేలేదు. అది ఉందో, లేదో కూడా అర్థంకావడం లేదని సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పునర్విభజన చట్టం ప్రకారం బోర్డులతోపాటు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు కావాలి. కాగా కేంద్రం బోర్డులను మాత్రమే ఏర్పాటు చేసి ట్రిబ్యునల్‌ను గాలికొదిలేసింది. ఈ ఏడాది ప్రత్యేకంగా గెజిట్‌ను విడుదల చేసి బోర్డుల పరిధిని ఖరారు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టులను ఆయా బోర్డులకు అప్పగించాలనీ, వీటి నిర్వహణ, ఇతర అవసరాల కోసం రూ. 200 కోట్ల చొప్పున కేటాయించాలని ఆదేశించింది. వీటికి సీఐఎస్ఎఫ్ పర్యవేక్షణలో భధ్రత కల్పించేందుకు నిర్ణయించింది. అంతేగాక రెండు రాష్ట్రాల్లోని అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డులు, సీడబ్ల్యూసీకి సమర్పించి ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. అయితే ఇటు తెలంగాణ , అటు ఏపీ ప్రభుత్వాలు కొన్ని ప్రతిపాదనలకు పాక్షికంగా అంగీకరిస్తూనే, మరో కొన్నింటీని తిరస్కరించాయి. 1973కు ముందున్న ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించేది లేదంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి అడిగిన సమాచారమంతా కేంద్రానికి, సీడబ్ల్యూసీకి ఎప్పటికప్పుడు అందజేస్తున్నది. ఇకపోతే రూ. 200 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడానికి రెండు రాష్ట్రాలు ఇష్టపడటం లేదు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా విడతలవారీగా ఇస్తామని చెప్పాయి. ఇందుకు కేంద్రం అంగీకరించలేదని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 50 కోట్లను కేఆర్ఎంబీకి ఇచ్చేందుకు సమాలోచన చేస్తున్నది. ఈమేరకు సంబంధించిన ఫైలు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్టు అధికారిక సమాచారం. త్వరలోనే ఈవిషయమై సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. అలాగే మంగళవారం రెంగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతరు ఉన్నతాధికారులతో కేంద్ర ప్రభుత్వ జలశక్తిశాఖ కార్యదర్శి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. బోర్డుల పరిధి, నిధుల విడుదల, డీపీఆర్‌ల సమర్పణ, ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ భద్రత తదితర అంశాలపై చర్చకు రానున్నట్టు సమాచారం. ఇందుకోసం సోమవారం రాష్ట్ర సాగునీటిపారుదల, ఆయకట్టు శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ అధికారులతో సమీక్ష చేశారు. ప్రధాన కార్యదర్శుల సమావేశం ఎజెండాపై అధికారులతో మాట్లాడారు. ఈసమావేశం కోసం ప్రత్యేక నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు అందజేసినట్టు తెలిసింది.