Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సినేషన్ వేగం పెంచాలి
- బూస్టర్ డోసుకు, 15-18 ఏండ్ల వారికి టీకా ఏర్పాట్లు : మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండో డోసును వందశాతం పూర్తి చేసేందుకు వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని ఆదేశించారు. అదే విధంగా 60 ఏండ్లు పైబడిన వారికి బూస్టర్ డోసు, 15 నుంచి 18 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన వారికి కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. 15-18 ఏండ్ల వయస్సు వారు 22.78 లక్షలు, 60 ఏండ్లపైబడిన వారు 41.60 లక్షలు, హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వారియర్లు 6.34 లక్షలు ఉన్నారనీ, వీరందరికీ దాదాపు 70 లక్షల వ్యాక్సిన్ డోసులు అవసరమవుతాయని తెలిపారు. , జనవరి 3 నుంచి 15-18 వయస్సు వారికి, అదే నెల 10 నుండి 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా అదుపులో ఉన్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోవటంతో పాటు, మాస్కు ధరించాలనీ,చేతులు శుభ్రంగా ఉంచుకోవాలనీ, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.