Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని బడ్జెట్ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సులు ఆన్ లైన్ ద్వారా అందించేందుకు గ్రావిటీ క్లౌడ్ సంస్థ ముందుకొచ్చింది. ట్రస్మా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఎడ్ ఎక్స్-21 స్కూల్ లీడర్ షిప్ సమ్మిట్లో సోమవారం ఈ ఒప్పందం జరిగింది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ట్రస్మా సభ్యత్వం ఉన్న ప్రతి పాఠశాలకు ఐఐటీ, నీట్ విద్యను బోధించనున్నారు. ఈ సందర్భంగా గ్రావిటీ క్లౌడ్ సంస్థ చైర్మన్ జెల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక మంది పేద విద్యార్థులు ఆర్థికంగా వెనుకబాటు కారణంగా ఐఐటీ, నీట్ ఫౌండేషన్ అభ్యసనకు దూరంగా ఉన్నారని తెలిపారు.
కొన్ని పాఠశాలల్లో ఈ విద్యను బోధిస్తున్నప్పటికి ఆర్థిక భారం వల్ల నేర్చుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పాఠశాలలను ఎంచుకుని వారికి ఆన్లైన్ ద్వారా శిక్షణ అందించన్నున్నామని తెలిపారు.
రాష్ట్రంలో కార్పొరేట్ మాఫియా
అనంతరం ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్ల మాఫియా కొనసాగుతున్నదనీ, ఆయా పాఠశాలల్లో ఐఐటీ, నీట్ కోర్సుల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ వికాసానికి కాకుండా మార్కుల కోసమే పని చేస్తూ విద్యార్థులను మార్కుల యంత్రాలుగా మారుస్తున్నాయని విమర్శించారు.. రాష్ట్రంలో కార్పొరేట్ మాఫియాను రూపుమాపడానికి ట్రస్మా కంకణం కట్టుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్, కోశాధికారి రమణా రావు, ఎడ్ ఎక్స్ కన్వీనర్ ప్రసాద రావు, ట్రస్మా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వొడ్నాల శ్రీనివాస్, కో కన్వీనర్ లు యాదగిరి, శ్రీకాంత్ రెడ్డి, జనార్దన్, సయీద్ అహ్మద్, బీరప్ప, ఉమామహేశ్వరరావు, వివిద జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.