Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాల విద్యా డైరెక్టర్‌కు టీజీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏజెన్సీ ప్రాంత హక్కులను కాలరాస్తున్న జీవో 317ను సవరించి గిరిజన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ సర్దుబాటు జీవో 317 వల్ల ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల హక్కులకు తీవ్ర భంగం కలుగుతుందని పేర్కొన్నారు. 1950 నుంచి ఏజెన్సీ స్థానికత ఆధారంగా లబ్ధి పొందుతూ వస్తున్న ప్రత్యేక హక్కులను ఈ జీవో కాలరాస్తున్నదని తెలిపారు. ఆ ప్రాంత పరిధిలోనే సర్దుబాటు చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా మైదాన ప్రాంతాలకు పంపడం వారి హక్కులను కాలరాయడమేనని తెలిపారు. రాజ్యాంగంలోని 244 ,244 ( ఎ) ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రత్యేక వెసులుబాటు ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వ అనాలోచిత విధానం వల్ల ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ హక్కులను, స్థానికతను కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల భార్యా,భర్తలు వికలాంగులు, ఒంటరి మహిళా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు.