Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించే వరకూ పోరాటం
- ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి నిరసనగా నేడు సచివాలయం ముట్టడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317 వల్ల స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. వారిని సొంత జిల్లాలకు కేటాయించేంత వరకూ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించింది. ప్రాధాన్యత, భార్యాభర్తలు, సీనియార్టీపై అభ్యంతరాలను సత్వరమే పరిష్కరించాలని కోరింది. అంతర్ జిల్లా, పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలని సూచించింది. పాఠశాలలకు అడ్‌హక్ పద్ధతిలో కేటాయింపులు చేసి సాధారణ బదిలీల్లో అందరికీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు, బాధ్యతారాహిత్యానికి నిరసనగా మంగళవారం సచివాలయం (బీఆర్కే భవన్) ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ నేతలు చావ రవి, కె జంగయ్య, మైస శ్రీనివాసులు, టి లింగారెడ్డి, సైదులు, ఎన్ యాదగిరి మాట్లాడుతూ స్థానికత మూలాలు ధ్వంసమయ్యేలా ఉద్యోగులు, ఉపాధ్యాయుల శాశ్వత కేటాయింపులున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మూడు లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయని అన్నారు. భార్యాభర్తలను విడదీసే పద్ధతిలో విభజన ప్రక్రియ ఉందన్నారు. 317 జీవో ఏకపక్షంగా ఉందనీ, సవరించాలని డిమాండ్ చేశారు. ఎక్కడా స్థానికత ప్రస్తావన లేదన్నారు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలు ఛిద్రమవుతున్నాయని చెప్పారు. మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో సీనియార్టీ జాబితాల్లో అవకతవకలు జరిగాయని విమర్శించారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభ్యంతరాలను స్వీకరించకుండానే కొత్త జిల్లాలకు కేటాయిస్తున్నారని వివరించారు. స్థానికత ఉన్న కొత్త జిల్లాను వదిలి వేరే జిల్లాకు స్థానికేతరులుగా వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ తరహాలో మరో ఉద్యమం రాబోతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం కర్ర పట్టుకుని 317 జీవోను అమలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా?, నియంతృత్వమా?అని అడిగారు. 'పుట్టి, పెరిగి, చదివి, ఉద్యోగం చేస్తున్న వారిని ఇప్పుడు ఈ జిల్లా నీది కాదంటే ఎలా?అని నిలదీశారు. ఉద్యమాలు కొత్తకాదనీ, ఎన్ని నిర్బంధాలున్నా సచివాలయాన్ని ముట్టడిస్తామనీ, దేనికైనా తెగించి కొట్లాడతామని హెచ్చరించారు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, మంత్రులు, అధికారులను కలిసినా ప్రయోజనం లేదన్నారు. అన్ని జీవోలనూ తామే తెప్పించామనీ చెప్పే ఒక ఉపాధ్యాయ సంఘం ఇదీ తమ వల్లే వచ్చిందంటూ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.