Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరిసిల్లలో కార్మికులు, ఆసాముల ధర్నా
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
పవర్లూమ్ కార్మికులకు 10శాతం యార్న్ సబ్సిడీ, ఆసాములకు డాబీ(పింజర) సబ్సిడీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిరిసిల్లలో ధర్నా చేశారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ), ఆసాముల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం బీవై.నగర్లోని చేనేత, జౌళి శాఖ కార్యాలయం ఎదుట బైటాయించారు. అనంతరం చేనేత జౌళి శాఖ ఏడీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్, ఆసాముల సమన్వయ కమిటీ నాయకుడు సిరిసిల్ల రవీందర్ మాట్లాడారు. బతుకమ్మ చీరలకు సంబంధించి 10శాతం సబ్సిడీని పవర్లూమ్ కార్మికులకు అందించకుండా చేనేత జౌళి శాఖ, టెస్కో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 2021 బతుకమ్మ చీరల పంపిణీ జరిగినా.. ఇంకా 2019 - 2020 సంబంధించిన సబ్సిడీని కూడా ఇవ్వలేదని తెలిపారు. అలాగే, 2021 బతుకమ్మ చీరలకు సంబంధించి పింజర్ల డబ్బులను సబ్సిడీ రూపకంగా బతుకమ్మ చీరల ఉత్పత్తి పూర్తి కాగానే ఆసాములకు అందిస్తామని చేనేత జౌళి శాఖ కమిషనర్ హామీ ఇచ్చినా అమలు కాలేదన్నారు. దీంతో ఆసాములు అప్పులు తెచ్చి ఏర్పాటు చేసుకున్న పింజర్ల డబ్బులకు మిత్తి కట్టలేక ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి సబ్సిడీ డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి పండుగలోపు ఇవ్వకుంటే కార్మికులు, ఆసాములతో కలిసి పెద్దఎత్తున చలో హైదరాబాద్ చేనేత జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మోర అజరు, నక్క దేవదాస్, గుండు రమేష్, ఎనగంటి రాజమల్లు, గడ్డం ఎల్లయ్య, సబ్బని చంద్రకాంత్, అసాముల సమన్వయ కమిటీ నాయకులు రమేష్, అశోక్, రవి, శ్రీకాంత్ పాల్గొన్నారు.