Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ మధుసూదన్‌రెడ్డి
- విద్యాభవన్ వద్ద అధ్యాపకుల నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అధ్యాపకుల కేటాయింపులున్నాయని ఇంటర్ విద్యాజేఏసీ చైర్మెన్ పి మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. మల్టీ జోనల్ క్యాడర్లో గుర్తించిన జూనియర్, డిగ్రీ లెక్చరర్లను విచక్షణా రహితంగా కేటాయిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో విద్యాభవన్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో అధ్యాపకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ విద్యలో ఆరువేలకుపైగా అధ్యాపకపోస్టులున్నాయని తెలిపారు. అందులో కేవలం 725 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారని వివరించారు. కానీ మల్టీ జోన్-1కు 130 మంది జూనియర్, 78 మంది డిగ్రీ లెక్చరర్లను కేటాయించారని వివరించారు. భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉన్నా పరిగణనలోకి తీసుకోకుండా బదిలీ చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజీ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు సంజీవ, ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, జూనియర్ కాలేజీల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరామ్ జాదవ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రజిత, లక్ష్మి, కవితాకిరణ్, విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు.