Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత జిల్లాకు కేటాయించని వారికి పరస్పర బదిలీలకు అవకాశమివ్వాలి : సీఎస్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టింగ్ ఉత్తర్వుల ప్రక్రియను మూడురోజులపాటు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. సీనియార్టీ జాబితాల్లో తప్పులను సవరించాలని కోరారు. ఆ తర్వాతే ఉపాధ్యాయులకు కేటాయింపులను చేపట్టాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌కు సోమవారం ఆయన లేఖ రాశారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ పాత జిల్లాల క్యాడర్ల సీనియార్టీలో జరిగిన తప్పులను సవరించకుండానే కొత్త జిల్లాలకు కేటాయించడం సరైంది కాదని తెలిపారు. స్పౌజ్ కేటాయింపులు పూర్తి చేయాలని కోరారు. పోస్టింగులు ఇచ్చేటప్పుడు జిల్లాలోని ఖాళీలన్నీ ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలకు కేటాయింపులో సొంత జిల్లాకు కాకుండా ఇతర జిల్లాలకు కేటాయించిన వారికి పరస్పర బదిలీ (మ్యూచువల్ ట్రాన్స్ఫర్) ద్వారా మార్పిడికి అవకాశం కల్పించాలని సూచించారు. మానవతా దృక్పథంతో కొత్త క్యాడర్లలో కేటాయించిన జిల్లా నుంచి సొంత జిల్లాకు వెళ్లే వారికీ అవకాశం కల్పించాలని కోరారు. వికారాబాద్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల నుంచి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని వివరించారు. దీనివల్ల రాబోయే నియామకాల్లో ఆ జిల్లాల యువతకు అవకాశాలు వస్తాయని తెలిపారు. అవసరమైతే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని కోరారు. ఆ తర్వాతే కొత్త జిల్లా క్యాడర్లలో పోస్టింగులు, ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు.