Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల ముందు ఉద్యోగాల ప్రకటన
- ఆ తర్వాత విస్మరణ : సీఎం కేసీఆర్పై బండి సంజయ్ విమర్శ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎన్నికల వేళ ఉద్యోగాలిస్తామంటున్న సీఎం కేసీఆర్ ఆ తర్వాత వాటి సంగతే మరిచిపోతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన నిరుద్యోగ దీక్ష సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనే ఉద్యోగాల కోసం జరిగిందనీ, ఆ ఉద్యోగాలే రానప్పుడు తెలంగాణ దేని కోసమని ప్రశ్నించారు. రాష్ట్రావిర్భావం ముందు స్థానికులకు ఉద్యోగాలు దక్కకుండా ఇతరులు లాక్కుంటున్నారంటూ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రం వచ్చాక కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బిస్వాల్ కమిటీ 1.92 లక్షల ఖాళీలున్నాయని తేల్చిందని తెలిపారు. సంబంధిత సమగ్ర సర్వే రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జనవరిలో లోపు నోటిఫికేషన్లు వేయకుంటే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. 2023లో ఉద్యోగాలిచ్చే బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వద్దనీ కేసీఆర్ జ్యూస్ తాగి దొంగ దీక్ష చేశారని విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాల కారణంగా ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ధాన్యానికి సంబంధించి కేంద్రం మీద నెపం వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని, మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలిపెట్టేదే లేదన్నారు. ఉద్యోగులు బయటకి రావాలని పిలుపునిచ్చారు. వారికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయ శాంతి, నాయకులు తీన్మార్ మల్లన్న, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.