Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత దేశంలో రైతు ఉద్యమాలు పుస్తకావిష్కరణలో వినరుకుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో రైతాంగ పోరాటాల చరిత్ర చాలా గొప్పదని, ఆయా ఉద్యమాల కాలం పరిస్థితులను, దృక్పథాలను పుస్తక రూపంలో తీసుకురావటం అభినందనీయమని ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్ వినరుకుమార్ చెప్పారు. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఆధ్వర్యంలో రూపొందించిన సోమవారం నాడిక్కడి హైదరాబాద్ బుక్‌ఫెయిర్ లోని చిందుఎల్లమ్మ వేదికపై ''భారత దేశంలో రైతు ఉద్యమాలు' పుస్తకాన్ని ఆయన అవిష్కరించారు. ఈ సందర్భంగా వినరుకుమార్ మాట్లాడుతూ పుస్తక రచయిత సారంపల్లి మల్లారెడ్డికి రైతాంగ ఉద్యమాల పట్ల ఎంతో పరిజ్ఞానం ఉందని చెప్పారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, ప్రభుత్వ విధానాలపై వాస్తవ విశ్లేషణలు చేయగల ఏకైక వ్యక్తి ఆయనే అని చెప్పటం అతిశయోక్తి కాదన్నారు.ప్రజాస్వామిక, అభ్యుదయ భావాలు కలిగిన వారు తప్పకుండా ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు, పుస్తక రచయిత సారంపల్లి మాట్లాడుతూ చరిత్రను చాలా మంది రాశారనీ, అయితే కొందరు దాన్ని వక్రీకరించి రాసినవారు కూడా ఉన్నారని చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విముక్తి, విమోచన, విద్రోహం ఇలా రకరకాలుగా విశ్లేషిస్తున్నారని వివరించారు. జరిగింది జరిగినట్టు, వాస్తవాలను వివరించాలని చెప్పారు. దేశంలో రైతుల పోరాటాలు అనేక రూపాల్లో జరుగుతున్నాయని తెలిపారు. స్వతంత్రంగానూ, ఐక్యంగాను అనేక సంఘాలు ఈ పోరాటాల్లో పాల్గొంటున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం జరుగుతున్న పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు ఒక వేదిక మీదికి వచ్చినప్పుడు విజయం అనివార్యమవుతుందని చెప్పారు. ఏడాది కాలంగా జరిగిన ఢిల్లీ ముట్టడిని నిర్వీర్యం చేసేందుకు మోడీ సర్కారు ఎన్నో కుట్రలు చేసిందని చెప్పారు. అయినా పట్టుదలతో ఆ పోరాటం జరిగిందన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి జంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నవతెలంగాణ బుకహేౌస్ మేనేజర్ కోయ చంద్రమోహన్,జి విజయరావు తదితరులు మాట్లాడారు.