Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.6,831 కోట్ల కరెంటు షాక్...
- గృహ వినియోగదారులపై అదనపు భారం రూ.2,110 కోట్లు
- పరిశ్రమలపై రూ.4,721 కోట్లు
- ప్రతిపాదించిన డిస్కంలు
- టీఎస్ఈఆర్సీకి టారిఫ్ అందజేత
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కరెంటు స్విచ్ ముట్టుకుంటే షాక్ కొట్టేలా చార్జీలు భారీగా పెరగనున్నాయి. మొత్తంగా రూ.6,831 కోట్ల భారాలను ప్రజలపై వేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రతిపాదించాయి. గృహవిద్యుత్ వినియోగదారులకు (ఎల్టీ) యూనిట్‌కు 50 పైసలు, పరిశ్రమలకు (హెచ్‌టీ) యూనిట్‌కు ఒక్క రూపాయి చొప్పున అన్ని కేటగిరీలపైనా చార్జీలు పెంచాలని ప్రతిపాదించాయి. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకూ అందరికీ ఒకే రకమైన 'వాత'ను నిర్ణయించాయి. ఎల్టీ వినియోగదారులకు చార్జీలు పెంచడం ద్వారా రూ.2,110 కోట్లు, హెచ్‌టీ చార్జీల పెంపు ద్వారా రూ.4,721 కోట్లు ఆదాయం పెరుగుతుందని లెక్కలు కట్టారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సోమవారం టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాయి. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎమ్‌డీ ఏ గోపాలరావు టీఎస్ఈఆర్సీ చైర్మెన్ తన్నీరు శ్రీరంగారావుకు ఈ టారిఫ్ ప్రతిపాదనలను అందచేశారు. ఐదేండ్లుగా కరెంటు చార్జీలు పెంచలేదనీ, ఇప్పుడు తప్పనిసరై చార్జీలు పెంచాల్సి వచ్చిందని డిస్కంల సీఎమ్‌డీలు తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిస్కంల మొత్తం ఆదాయ అవసరాలు (ఏఆర్ఆర్) రూ.53,054 కోట్లు. ప్రస్తుతం ఉన్న టారిఫ్, ప్రభుత్వ సబ్సిడీ ద్వారా రూ.42,126 కోట్ల ఆదాయం వస్తున్నది. రూ.10,928 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. కరెంటు చార్జీలను పెంచడం ద్వారా రూ.6,831 కోట్లు, అంతర్గత సామర్థ్యం, ప్రభుత్వ సహకారం ద్వారా రూ.4,097 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటామని డిస్కంలు టారిఫ్ ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. కేంద్రప్రభుత్వం క్లీన్ ఎనర్జీ సెస్‌ను టన్నుకు రూ.50 నుంచి రూ.400 కి పెంచిందనీ, బొగ్గు ఖరీదు టన్నుకు రూ.800 పెరిగిందనీ, రైలు రవాణా 40 శాతం పెరిగిందనీ, పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు భారం కూడా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలపై పడినట్టు సీఎమ్‌డీలు చెప్పారు. దానితోపాటు ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెటవర్క్ అభివృద్ధికి రూ.34,087 కోట్లు ఖర్చుచేసినట్టు వారు తెలిపారు. చార్జీలు పెంచినా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు 101 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 250 యూనిట్ల వరకు నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ సరఫరా, పవర్‌లూమ్స్, పౌల్ట్రీ, స్పిన్నింగ్ మిల్స్‌కు యూనిట్ రూ.2 రాయితీ కొనసాగుతాయని వివరించారు.
ఇవీ కనెక్షన్లు...
గృహవినియోగదారులకు చెందిన ఎల్టీ విభాగంలో 1.10 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. ఇవికాక మరో 44 లక్షల గహేతర కేటగిరీల వినియోగదారులు ఉన్నారు. వీరందరిపై చార్జీల పెంపు భారం రూ.2110 కోట్లు పడుతుంది. అలాగే హెచ్‌టీ విభాగంలోని అన్ని కేటగిరీల్లో 13,717 కనెక్షన్లు ఉన్నాయి. వీరిపై రూ.4721 కోట్ల అదనపు భారం పడుతుంది.
మే నెల బిల్లులో...
2022 ఏప్రిల్ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వస్తుంది. ఏప్రిల్ నెల వినియోగానికి ఆ తర్వాతి మే నెలలో జారీ చేసే బిల్లుతో వినియోగదారులకు పెరిగిన చార్జీల భారం కనిపిస్తుంది.
ఆర్థిక లోటు రూ.16,580 కోట్లు...
వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022-23) నిరంతర విద్యుత్ సరఫరాకు రూ.53,054 కోట్ల వ్యయం అవుతుందని డిస్కంలు అంచనా వేశాయి. ప్రస్తుత చార్జీలను యతాథతంగా అమలు చేస్తే రూ.36,474 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందనీ, ఆర్థిక లోటు రూ.16,580 కోట్లుగా ఉంటుందని ఏఆర్‌ఆర్‌లో పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5,652 కోట్ల సబ్సిడీ సొమ్ముతో, ఆదాయం రూ.42,126 కోట్లకు పెరిగి, ఆదాయ లోటు రూ.10,928 కోట్లకు తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రతిపాదిత విద్యుత్ చార్జీల పెంపుతో రూ.6,831 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటామనీ, మరో రూ.4,097 కోట్ల ఆదాయ లోటును అంతర్గత సామర్థ్యం పెంపు, ప్రభుత్వ మద్దతుతో భర్తీ చేసుకుంటామని డిస్కంలు ఈఆర్సీకి నివేదించాయి.
డిస్కంల లెక్క ఇదీ... (కోట్లల్లో)
వార్షిక మొత్తం ఆదాయ అవసరాలు 53,054
ప్రస్తుత టారిఫ్ ద్వారా వస్తున్న ఆదాయం 42,126
ఆదాయలోటు 10,928
చార్జీల పెంపు ద్వారా వచ్చే ఆదాయం 6,831
అంతర్గత సామర్థ్యం, ప్రభుత్వ సహకారం 4,097
వినియోగదారుల లెక్క ఇలా...
కేటగిరీ సంఖ్య
గహ 1.10 కోట్లు
వాణిజ్య 13,27,494
ఎల్టీ-పరిశ్రమలు 66,519
ఎల్టీ-కుటీర పరిశ్రమలు 10,419
వ్యవసాయం 25078
హెచ్‌టీ-పరిశ్రమలు 7756
హెచ్‌టీ-వాణిజ్య 4509
ఎల్టీ-మొత్తం 1,54,77,454
హెచ్‌టీ-మొత్తం 13,717
మొత్తం వినియోగదారులు 1,54,91,170
కేటగిరివారీగా పెంపు ప్రతిపాదన ఇలా... కేటగిరీ వినియోగం పరిమితి ప్రస్తుత చార్జీలు ప్రతిపాదిత పెంపు
ఎల్టీ-1(ఏ) 100 యూనిట్ల వరకు/నెలకు
0-50 యూనిట్లు రూ.1.45 రూ. 1.95
51-100 రూ. 2.60 రూ. 3.10
ఎల్టీ-1(బీ1) 100- 200 యూనిట్లలోపు
0-100 యూనిట్లు రూ.3.30 రూ.3.80
101-200 యూనిట్లు రూ. 4.30 రూ. 4.80
ఎల్టీ-1(బీ2) 200 యూనిట్లకు పైన
0-200 యూనిట్లు రూ. 5.00 రూ. 5.50
201-300 యూనిట్లు రూ. 7.20 రూ. 7.70
301-400 యూనిట్లు రూ. 8.50 రూ. 9.00
400 - 800 యూనిట్లు రూ. 9.00 రూ. 9.50
800 యూనిట్లకుపైన రూ. 9.50 రూ. 10.00