Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 317 జీవోను రద్దు చేయాలి : తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్
- బీఆర్కే భవన్ ముట్టడికి యత్నం
- సంపత్‌కుమారస్వామి, పురుషోత్తం సహా పలువురు అరెస్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో స్థానికత ఆధారంగా ఉద్యోగులు, ఉధ్యాయులను కేటాయించాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 317 జీవోను రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు ఆ అసోసియేషన్ నేతలు రాష్ట్ర సచివాలయం బీఆర్కే భవన్ ముట్టడికి యత్నించారు. '317 జీవోను రద్దు చేయాలనీ, స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలి'అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. బీఆర్కే భవన్‌వైపు వచ్చిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు చిలగాని సంపత్కుమార స్వామి, ప్రధాన కార్యదర్శి పి పురుషోత్తం, మహిళా విభాగం అధ్యక్షురాలు జి నిర్మల సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసిన రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు మీడియాతో సంపత్‌కుమారస్వామి మాట్లాడుతూ రాజ్యాంగంలోని 371-డీ ఆర్టికల్ క్లాజ్ 1,2 ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి సమానమైన అవకాశాలు, వసతులు ఉండాలని చెప్పారు. దాని స్ఫూర్తితో 124 జీవోను 2018, ఆగస్టులో ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. స్థానికత ఆధారంగా ప్రస్తుతం పనిచేస్న్ను ఉద్యోగులు, ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు కేటాయించాలని సూచించారు. కానీ రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి భిన్నంగా సీనియార్టీ ప్రాతిపదికన కేటాయించడం అన్యాయమని విమర్శించారు. ప్రస్తుతం చేపట్టిన ప్రక్రియను రద్దు చేసి పారదర్శకంగా కేటాయింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు. 317 జీవోను రద్దు చేయకపోతే ఉద్యోగులు, ఉపాధ్యాయులను చైతన్యపరిచి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం మాట్లాడుతూ సీనియార్టీ ప్రాతిపదికన ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపులు చేపట్టడం సరైంది కాదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం టీజీవో, టీఎన్జీవోతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు యాకూబ్‌పాషా, ప్రభాకరాచారి,రంజిత్‌కుమార్,వినోద్‌కుమార్, శ్రీనివాస్, సుజాత చౌహాన్, లక్ష్మణాచారి, గోవింద్‌నాయక్ పాల్గొన్నారు.