Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు.. కార్మికుల ఆగ్రహం
నవతెలంగాణ- విలేకరులు
పన్నేతర రంగమైన వస్త్ర పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వేయడమే కాకుండా.. ఇప్పుడు 5నుంచి 12శాతానికి పెంచడంపై చేనేతరంగ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనాతో ఉపాధి లేక.. వస్త్రాల కొనుగోళ్లు లేక.. నిల్వలు పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పన్ను ఎలాపెంచుతారని నిలదీస్తున్నారు. అరకొరగా ఉన్న ఉపాధిని దెబ్బతీసేలా జీఎస్టీ పన్ను పెంచొ ద్దని డిమాండ్ చేస్తూ పలు జిల్లాల్లో సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం, అనుబంధ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడ్రోజుల నిరసన దీక్ష చేపట్టారు. సోమవారం మొదటి రోజు దీక్ష ప్రారంభించారు. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపి పాల్గొన్నారు. జీఎస్టీని పెంచొద్దని, ఉన్నదాన్నే తొలగించాలని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చేనేత దుకాణాలను బంద్ చేశారు. చేనేత హ్యాండ్లూమ్ మాస్టర్ వీవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జీఎస్టీ తగ్గించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పట్టణ క్లాత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ తీశారు.