Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
- ఉపాధ్యాయుల్లో ఆందోళన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌ల కోసం నిర్వహించే ప్రత్యక్ష కౌన్సెలింగ్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయుల పాఠశాలల ఎంపిక కోసం జరిగే ప్రత్యక్ష కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారు. ఇంకోవైపు జిల్లాల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ కౌన్సెలింగ్‌లో చూపించాలంటూ ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించారు. జిల్లా కేంద్రాలు, పట్టణాలకు దగ్గరలోని ఉపాధ్యాయ ఖాళీలను ఎందుకు చూపించడం లేదంటూ నిలదీస్తున్నారు. కలెక్టర్లపై ఒత్తిడి పెరిగింది. ఇదే విషయాన్ని వారు సీఎస్ దృష్టికి తెచ్చారు. దీన్ని పరిశీలించిన ఆయన కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని ఆదేశించినట్టు సమాచారం.
కౌన్సెలింగ్ రద్దు అన్యాయం : యూఎస్పీసీ
జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులు పాఠశాలల ఎంపిక కోసం ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ను సీఎస్ రద్దు చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఇది అన్యాయమని విమర్శించింది. పరిచయం లేని జిల్లాలో ఒక్కో టీచర్ వందలాది పాఠశాలలను వరుస క్రమంలో ఎంచుకోవడం కష్టమని తెలిపింది. ప్రత్యక్ష కౌన్సెలింగ్‌లో అయితే ఆ సమయానికి ఉన్న ఖాళీల్లో ఒకటి ఎంచుకోవడం సులభంగా ఉంటుందని పేర్కొంది. హఠాత్తుగా కౌన్సెలింగ్ రద్దు చేయడం, ఈ రాత్రికే ఆప్షన్ ఫారాలు సమర్పించాలని ఆదేశించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించింది. దీంతో ఉపాధ్యాయుల్లో తీవ్రమైన గందరగోళం నెలకొందని తెలిపింది. ఉపాధ్యాయులకు వెసులుబాటు ఇవ్వకుండా మానసిక వేదనకు గురిచేస్తున్నారని విమర్శించింది. అన్ని జిల్లాల్లో ప్రత్యక్ష కౌన్సెలింగ్ విధానంలోనే పాఠశాలలను ఎంచుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది.
భౌతిక కౌన్సెలింగ్ నిర్వహించాలి : జాక్టో
ఉపాధ్యాయులకు పాఠశాలలను ఎంచుకోవడానికి భౌతిక కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) నాయకులు జి సదానందంగౌడ్, ఎం పర్వత్‌రెడ్డి, ఎం రాధాకృష్ణ, కొంగల వెంకటి, కె కృష్ణుడు, వి రావు, జయబాబు, లక్ష్మణ్‌నాయక్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల హక్కులను కాపాడేలా స్పష్టంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కౌన్సెలింగ్‌లో అన్ని ఖాళీలనూ చూపించాలని తెలిపారు. సీనియార్టీ జాబితాల్లో తప్పులను సవరించాలని పేర్కొన్నారు. స్పౌజ్ కేటాయింపులో మార్గదర్శకాలివ్వాలని వివరించారు.
అంతర్జిల్లా బదిలీలకు అవకాశం కల్పించాలనీ, ప్రస్తుత పోస్టింగ్‌లన్నీ అడ్‌హక్ పద్ధతిలో కేటాయించాలనీ, సాధారణ బదిలీల్లో అందరికీ అవకాశం కల్పించాలని కోరారు. అవకతవకలను పూర్తిస్థాయిలో పరిష్కరించిన తర్వాతే కౌన్సెలింగ్ నిర్వహించాలని తపస్ అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ డిమాండ్ చేశారు. ఆప్షన్ ఫారమ్ తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పి వెంటనే మాట మార్చడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని కోరారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ముగిసే వరకు ఉపాధ్యాయులను యధాతధంగా కొనసాగించాలని టీఎస్పీటీఏ అధ్యక్షులు సయ్యద్ షౌకత్‌అలీ, ప్రధాన కార్యదర్శి ఎన్ చెన్నరాములు డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో కౌన్సెలింగ్ నిర్వహించి శాశ్వత బదిలీలు నిర్వహించాలని సూచించారు.