Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు మావోయిస్టులు హతం.. అందులో నలుగురు మహిళలు
- తెలంగాణ సరిహద్దు - ఛత్తీస్‌గడ్‌లో కాల్పులు
నవతెలంగాణ -చర్ల
పచ్చని అడవులతో ఉన్న పెసర్లపాడు సోమవారం రక్తం మోడింది. దండకారణ్యంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునిల్‌దత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెసర్లపాడు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల రహస్య సమావేశాలు జరుపుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు యంత్రాంగం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు ఉదయం 6 గంటల నుంచి 7.30 వరకూ పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. అందులో నలుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మృతిచెందిన వారిలో ఎల్ఓఎస్ కమాండర్ రజిత, దళసభ్యుడు రాజేష్‌గా ఇద్దరు మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. మరో నలుగురి మృతదేహాలు గుర్తించాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. ఎదురుకాల్పుల్లో మరికొంతమంది గాయపడ్డట్టు, వారి కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు. ఒకానొక తరుణంలో చర్ల ఎల్వోఎస్ కమాండర్ మధు మృతి చెందినట్టు ప్రచారం జరిగింది. మృతదేహాలను స్వాధీనం చేసుకొని ప్రత్యేక ట్రాక్టర్లో చర్ల వైపు తరలించారు. అక్కడి నుంచి ఆంజనేయపురం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని కుంటకు అంబులెన్స్ ద్వారా తరలించినట్టు తెలిసింది. మృతి చెందిన మావోయిస్టులు నుంచి ఆరు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, బుల్లెట్లు, తుపాకులు 303 రెండు రైఫిల్, డీబీబీఎల్ నాలుగు, నాలుగు రాకెట్ లాంచర్లు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ప్రశాంతంగా ఉండే పచ్చని అడవుల్లో పేలిన తూటాలకి ఆదివాసీ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్కౌంటర్ అనంతరం జరిగే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే కొన్ని ఆదివాసీ గ్రామాల ప్రజలు వలసలు వెళుతున్నట్టు సమాచారం.