Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నీలం రంగు ఎరుపు' పుస్తకావిష్కరణలో సతీష్‌చందర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆకలికి, అన్నానికి, ఆత్మగౌరవానికి వారధి 'నీలం రంగు ఎరుపు' పుస్తకమని ప్రముఖ జర్నలిస్ట్, ఆంద్రప్రభ పూర్వ సంపాదకులు సతీష్ చందర్ అన్నారు. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఆధ్వర్యంలో సోమవారం నాడిక్కడి హైదరా బాద్ బుక్‌ఫెయిర్ చిందుఎల్లమ్మ వేదికపై '' నీలం రంగు ఎరుపు''' పుస్తకాన్ని ఆయన అవిష్కరించారు. అనంతరం సతీష్‌చందర్ మాట్లా డుతూ మార్క్సిజమంటేనే ప్రేమ, ప్రేమంటేనే మార్క్సిజమని చెప్పారు. శ్రమ జీవులు ఆకలితో అలమటిస్తుంటే..ఎలాంటి కష్టం చేయనివారు సుఖపడుతు న్నారని చెప్పారు. ఆకలొక చోట, అన్నమొక చోట ఉండకూడదనే..ఆకలికీ, అన్నానికి మార్క్స్ వారధి కట్టాడని చెప్పారు. భారత దేశంలో ఆకలితో పాటు ఆత్మగౌరవ సమస్యకూడా తీవ్రంగా ఉన్నదని గుర్తుచేశారు. పనికి తగ్గ కూలి కావాలని కొట్టాడిన రోజుల్లోనే..ఇక్కడ కూలికి వేతనమే లేదని గుర్తుచేశారు. అస్పృశ్యుడికి వేతనం ఇవ్వకూడదన్న ధర్మాలు వర్థిల్లాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అవమానానికి, ఆత్మగౌరవానికి అంబేద్కర్ వంతెన కట్టాలంటూ చెప్పారని తెలిపారు. కులం ఐక్యతను నాశనం చేస్తున్నదని చెప్పారు. కులం, వర్గం జమిలీ పోరాటాలు నిర్వహించాల్సిన అవసరముందన్నారు. రచయిత జి రాములు మాట్లాడుతూ పుస్తకంలో పొందుపర్చిన వ్యాసాలు ఆయా కాలాల్లో ముందుకొచ్చిన అంశాల ఆధారంగా రాసినవేనని చెప్పారు. కులం ప్రజల మధ్యఐక్యతని దెబ్బతీస్తున్నదనీ, ఇది పాలక వర్గాలకు బాగా ఉపయోగపడుతున్నదని వివరించారు. ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఆహ్వానించాల్సిందేనన్నారు. అసమానతలు తగ్గితేనే అభివృద్ధి సాద్యమవుతుందన్నారు. ప్రపంచంలో ఉన్న పరిస్థితులకు భిన్నమైన పరిస్థితులు భారత దేశంలో ఉన్నాయని చెప్పారు. ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత మాట్లాడుతూ అంబేద్కర్ వాదమంటే స్వేచ్ఛ, సమానత్వమని చెప్పారు. నీలం రంగు ఎరుపు పుస్తకం లోతైన పరిశీలనతో కూడుకున్నదని వివరించారు. బుక్‌ఫెయిర్ అధ్యక్షులు జూలూరి గౌరీ శంకర్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, టీపీఎస్కే నాయకులు భూపతి వెంకటేశ్వర్లు, కవి, రచయిత తంగిరాల చక్రవర్తి తదితరులు మాట్లాడారు.