Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం ప్రకటన కంటే ముందే ఆయిల్‌పామ్ సాగువైపు అడుగులేశాం
- కేంద్రం సహకరించాలి : రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్నామనీ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కంటే ముందే ఆయిల్ పామ్ సాగువైపు అడుగులేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హౌటల్లో నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ - ఆయిల్ పామ్(ఎన్ఎమ్ఈఓ-ఓపీ) బిజినెస్ సమ్మిట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..2014-2015లో 122 లక్షల ఎకరాలున్న సాగు 2020-21 కి 203 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. 2014-2015 లో 68.2 లక్షల మెట్రిక్ టన్నులున్న వరి ధాన్యం దిగుబడి 2020-21కి 259.2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని చెప్పారు. సాగు నీటి వసతిని పెంచడంతో పాటు సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణలో సాగు పెరిగిందన్నారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు ఎనిమిది విడతలలో రైతుల ఖాతాలలో జమచేశామని వివరించారు.దేశీయ డిమాండ్‌కు తగినట్టుగా పామాయిల్ ఉత్పత్తి సాధించాలంటే దేశంలో ఇంకా 70 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ గెలలు అత్యధిక నూనె ఉత్పత్తి శాతం కలిగిఉన్నవన్నారు. ఈ పథకం కింద రాబోయే ఐదేండ్లలో కేంద్రం 1.12 లక్షల ఎకరాలు కేటాయించిందన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నదనీ, దానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న అయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ - ఆయిల్ పామ్(ఎన్ఎమ్ఈఓ-ఓపీ) కింద ఆమోదించి నిధులు కేటాయించాలని కోరారు. ఆయిల్ ఫామ్ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ ధర టన్నుకు రూ.15000 కనీస ఖచ్చిత ధర నిర్ణయించి రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహించాలని కోరారు. ఆయిల్ పామ్ సాగుకవసరమయ్యే బిందుసేద్యం యూనిట్ ధరను పెంచి విస్తీర్ణ పరిమితిని ఎత్తేయాలని విన్నవించారు. తెలంగాణ డిమాండ్లపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌కు వినతిపత్రాన్ని మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి కూడా పాల్గొన్నారు.