Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కాటు నుంచి కోలుకోని చేనేతరంగం
- త్రిఫ్ట్ ఫండ్ పునరుద్ధరణతో కొంత ఊరట
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గతేడాది కరోనా వేసిన కాటు నుంచి తేరుకోకముందే చేనేతరంగంపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో 2021లో మరో పిడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల కొత్త ఏడాదిలో ఈ రంగం మరింత కుదేలు కానుందని చేనేత కార్మిక సంఘాలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
20 మంది బలి...
అన్ని రంగాలనూ కుదిపేసిన కరోనా చేనేతపైనా విరుచుకుపడటంతో ఈ యేడాది ఉపాధి కరువై, కుటుంబాలను పోషించలేక ఎనిమిది మంది చేనేత కార్మికులు, 12 మంది పవర్లూమ్ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో ఆయా కుటుంబాలు రోడ్డు నపడ్డాయి. గద్వాల, పోచంపల్లి, పుట్టపాక, వరంగల్, సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జరిగాయి.
యధేచ్ఛగా రిజర్వేషన్ చట్టం ఉల్లంఘన...
చేనేత రంగాన్ని రక్షించేందుకు తీసుకొచ్చిన రిజర్వేషన్ చట్టం రాష్ట్రంలో యధేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతున్నది. దీంతో చేనేత మగ్గాల మీదనే తయారు చేయాలంటూ నిబంధన విధించిన 11 రకాల వస్త్రాలను మరమగ్గాలు, జెట్ లూమ్ల మీద ఉత్పత్తి చేస్తున్నారు. వీటి ధాటికి తట్టుకోలేక చేనేత విలవిల్లాడుతున్నది.
21 వేల మందికి ఉపశమనం...
చేనేత, మరమగ్గం కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవే శపెట్టిన త్రిఫ్ట్ ఫండ్ పథకం 2019 వరకూ కొనసాగింది. ఆ తర్వాత సర్కారు దాన్ని మూసేసింది. అయితే కరోనా సంక్షిష్ట సమయంలో ఆ పథకంలో పొదుపు చేసుకున్న డబ్బులు... చేనేత, మరమర్గం కార్మికుల కుటుంబాలను కొంతలో కొంత ఆదుకున్నాయి. ఈ క్రమంలో వారి విజ్ఞప్తి మేరకు ఆ పథకాన్ని ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించటంతో దాదాపు 21 వేల మందికి లబ్ది చేకూరనుంది.
కేంద్రానికి కేటీఆర్ లేఖ...
వస్త్ర పరిశ్రమపై, ముఖ్యంగా చేనేతపై విధించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. కేంద్రానికి లేఖ రాయటం సంతోషించదగ్గ విషయం. ఇదే ఒరవడితో దాన్ని పూర్తిగా రద్దు చేసేంతవరకూ చేనేత, మరమగ్గం కార్మికులకు అండగా ఉంటూ... కేంద్రంపై ఒత్తిడి తెస్తే, వారికి మరెంతో ఉపశమనం కలుగుతుందనటంలో సందేహం లేదు. ఇదే జరిగితే పండగల సీజన్లలో వస్త్ర ప్రేమికులపై భారాలు పడకుండా నివారించటానికి వీలు కలుగుతుంది.
అంతా సిరిసిల్లకే...
చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం కావటం, మరమగ్గాలు ఎక్కువగా ఉండటం తదితర కారణాల వల్ల రాష్ట్రంలో ''చేనేత అంటే సిరిసిల్ల, సిరిసిల్ల అంటేనే చేనేత'' అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తున్నది. ఫలితంగా ప్రతీయేటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 'బతుకమ్మ చీరెల' ఆర్డర్లలో అత్యధిక భాగం సిరిసిల్లకే కేటాయించారు. ఇలాకాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, ఇంకా చెప్పాలంటే కార్మికులందరికీ పని కల్పించే విధంగా ఆ చీరెల ఉత్పత్తిని అన్ని ఏరియాల్లోనూ చేపట్టాలనే డిమాండ్ బలంగా వినపడుతున్నది.
ముడి సరుకుల ధరలు పైపైకి...
ఈ యేడాది చేనేత వస్త్రోత్పత్తికి వాడే ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. పట్టు, నూలు, జరీ, రంగులు, రసాయనాల ధరలు గతేడాదితో పోలిస్తే 30 నుంచి 40 శాతం వరకూ పెరగటంతో చేనేత కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో ఆ పరిశ్రమపై విపరీతమైన భారాలు పడ్డాయి.