Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్
- కరీంనగర్లో ఘనంగా కేడీసీసీ బ్యాంక్ శత వసంత ఉత్సవాలు
నవతెలంగాణ- కరీంనగర్ టౌన్
రైతాంగానికి సహకార బ్యాంకులు అండగా నిలుస్తూ దేశవ్యాప్త గుర్తింపు పొందాయని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో సహకార బ్యాంక్ స్థాపించి శత వసంతాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఉత్సవాలు నిర్వహించారు. ముందుగా కేడీసీసీ బ్యాంక్ చైర్మెన్ కొండూరు రవీందర్‌రావుతో కలిసి బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నాబార్డ్ చైర్మెన్ డాక్టర్ చింతల గోవిందరాజు జ్యోతి ప్రజ్వలన, పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు కొప్పుల, గంగుల మాట్లాడుతూ.. 1921లో స్థాపించిన కేడీసీసీ బ్యాంక్ 25 సంవత్సరాలపాటు నష్టాల్లో కొనసాగిందని, 2005లో చైర్మెన్‌గా కొండూర్ రవీందర్రావు బాధ్యతలు తీసుకున్న తరువాత లాభాల బాటలో ప్రయాణించడం అభినందనీయమని కొనియాడారు. కేడీసీసీ బ్యాంక్ ఇదే స్ఫూర్తిని కొనసాగించి రైతులకు అండదండలు అందించాలన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. సహకార బ్యాంక్ మిగతా బ్యాంకులకు దీటుగా సేవలందించాలని సూచించారు. నాబార్డ్‌కు వచ్చే ఆదాయంలో సింహభాగం తెలుగు రాష్ట్రాల నుంచే వస్తోందని తెలిపారు. సహకార వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ప్రాథమిక సహకార సంఘాలు పటిష్టంగా ఉండాలని చెప్పారు. అంతకు ముందు ఆయన కేడీసీసీ బ్యాంక్ ఆవరణలో శత వసంత ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రిబ్ కో చైర్మెన్ చంద్రపాల్ సింగ్ యాదవ్, జాతీయ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దిలీప్ సింగ్, బీహార్ ఎమ్మెల్సీ మార్కెటింగ్ ఫెడరేషన్ చైర్మెన్ సునీల్ కుమార్ సింగ్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, డాక్టర్ సంజరు కుమార్, కరీంనగర్ సిరిసిల్ల జగిత్యాల పెద్దపల్లి జిల్లాల జడ్పీ చైర్పర్సన్లు, చైర్మెన్ విజయ, అరుణ, వసంత, పుట్ట మధుకర్ పాల్గొన్నారు.