Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ నేతలకు సీఐటీయూ హితవు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విషయ ప్రాతిపదిక విమర్శలు చేసుకోవాలనీ, వాటిలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు లేకుండా చూసుకోవాలని రాజకీయ పార్టీల నేతలకు సీఐటీయూ హితవు పలికింది. టీఆర్ఎస్ ఎంపీలను, మంత్రులను విమర్శించే పేరుతో మహిళా కాంగ్రెస్ నేతలు గాజులు, చీరలు పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామనీ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, ఎం.సాయిబాబు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ రమ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు అనేక సందర్భాల్లో మహిళల పట్ల దుర్భాషలాడటాన్నీ తప్పుబట్టారు. మనుస్మృతి పేరుతో మహిళలను వంటింటికే పరిమితం చేయాలనే దృక్పథాన్ని విడనాడాలని సూచించారు. మహిళలపై అనేక దాడులు, లైంగిక దాడులు జరుగుతున్నా వారు దోషుల వైపే నిలబడటం అన్యాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్కు చెందిన మహిళా విభాగం నాయకత్వం కూడా మహిళలకు ఏమీ చేతకాదనే అర్థం స్ఫురించేలా వ్యవహరించడం అవివేకమని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందున్న స్థితిని గమనించకుండా స్త్రీలను వంటింటికే పరిమితం చేసే భావజాలంతో తప్పుడు వ్యాఖ్యానాలు చేయడాన్ని ఖండించారు. ఇలాంటి చర్యలపై ప్రజాస్వామిక వాదులు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.