Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ-దామరచర్ల
తెగుళ్ల కారణంగా పంట నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురంలో తెగుళ్ల కారణంగా నష్టపోయిన మిర్చి పైరులను మంగళవారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. నర్సాపురంతోపాటు పలు గ్రామాల్లో తామర వైరస్, బొబ్బెర ముడత, కంపు నల్లి తెగుళ్లు సోకడంతో మిర్చి పంట పెద్దఎత్తున దెబ్బతిన్నదన్నారు. అధికారుల సూచనల ప్రకారం 10 నుంచి 15 మార్లు మందులు కొట్టినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో రైతు ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టినట్టు తెలిపారు. నష్టపోయింది ఎక్కువగా చిన్న సన్నకారు, కౌలురైతులేనని అన్నారు. తెలంగాణలో సుమారు 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారన్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్లో అధికంగా మిర్చి వేశారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా తెగుళ్ల కారణంగా పెద్దఎత్తున పంట నష్టపోయిందన్నారు. తెగుళ్లతో ఎండిపోయిన మిర్చి పంటను మంత్రు లు, ఎమ్మెల్యేలు పరిశీలిం చకపోవడం తగద న్నారు. వెంటనే ప్రభుత్వం అధికారులను గ్రామాల్లోకి పంపి పంట నష్టాన్ని అంచనా వేయించి కేంద్రానికి పంపించాలని కోరారు. ఎకరానికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని, విడతల వారీగా కాకుండా పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే మిర్చి రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేయనున్నట్టు చెప్పారు. ఈ పర్యటనలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు బి.కోటిరెడ్డి, పాపానాయక్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వినోద్, అడవిదేవులపల్లి మండల కన్వీనర్ బాల సైదులు, సీఐటీయూ మండల కార్యదర్శి దయానంద్, ఖాజామోయినుద్దీన్ ఉన్నారు.