Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరద కాలువ భూసేకరణ.. కొండన్నపల్లి రైతుల ఆందోళన
- కోర్టుకెక్కిన ఆచంపల్లి, తాడిజెర్రి రైతులు
- అదేబాటలో కరీంనగర్ జిల్లా కొండన్నపల్లి రైతాంగం
నవతెలంగాణ - గంగాధర
వరద కాలువ, రైల్వే లైన్ల నిర్మాణాల్లో ఇప్పటికే వందలాది ఎకరాల భూములను కోల్పోయిన రైతులకు మరోసారి చిక్కువచ్చింది. అదనపు టీఎంసీ వరద కాలువ పేరుతో ప్రభుత్వ యంత్రాంగం మళ్లీ భూసేకరణకు సిద్ధమైంది. దాంతోపాటు ఇండ్లూ పోనున్నాయి. భూములన్నీ పోతే పిల్లా పాపలతో ఎలా బతకాలని రైతులు భూసేకరణ గ్రామసభలను బహిష్కరించినా.. ప్రభుత్వ యంత్రాంగం పని ఆగదని, భూములివ్వాల్సిందేనని తెగేసి చెబుతుండటంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొన్ని గ్రామాల రైతులు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అదేదారిలో మిగతా రైతాంగం వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి రైతులకు తమ గ్రామంతోపాటు న్యాలకొండపల్లి, కురిక్యాల గ్రామాల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల మేరకు వ్యవసాయ భూములు ఉన్నాయి. అయితే ఇప్పటికే తవ్వకం చేపట్టిన వరద కాలువ, నిజామాబాద్ -కరీంనగర్, కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్లలో ఈ రైతులు సుమారు 400 ఎకరాల భూములను కోల్పోయారు. అయితే, మరోసారి 1.1 టీఎంసీ అదనపు వరద కాలువ తవ్వకం కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. సుమారు 50 ఇండ్లు కూడా కాలువ తవ్వకంలో కోల్పోనున్నారు. న్యాలకొండపల్లి శివారులో ఉన్న 63.2 ఎకరాలు, కురిక్యాల శివారులో 52.15 ఎకరాలు, నాగిరెడ్డిపూర్ శివారులో ఉన్న 33.36 ఎకరాలు మొత్తంగా 149.13ఎకరాల మేరకు కొండన్నపల్లి పరిసర గ్రామాల రైతులు భూములను కోల్పోతున్నట్టు రెవెన్యూ యంత్రాంగం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రైతులు భూసేకరణ కోసం చేపట్టిన గ్రామసభలను బహిష్కరించారు. గ్రామానికి చెందిన ఒక్కో రైతు ఇప్పటికే వరద కాలువ, రైల్వేలైన్లలో రెండు నుంచి నాలుగెకరాలు కోల్పోయారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వరద కాలువ తవ్వకాల్లో భాగంగా అదనపు టీఎంసీ భూసేకరణలో ఉన్న కాస్త భూములు కూడా ఊడ్చుకుపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు.
కోర్టును ఆశ్రయిస్తున్న రైతులు
ఇప్పటికే భూములు కోల్పోయి ఆవేదనలో ఉన్న రైతాంగం మళ్లీ అదనపు టీఎంసీ వరద కాలువ తవ్వకానికి భూములు ఇవ్వలేమంటూ.. కోర్టును ఆశ్రయిస్తున్నారు. గంగాధర మండలంలోని నాగిరెడ్డిపూర్, న్యాలకొండపల్లి, కొండన్నపల్లి, కురిక్యాల, ఉప్పరమల్యాల, రంగారావుపల్లి, తాడిజెర్రి, గర్శకుర్తి, ఆచంపల్లి గ్రామాల మీదుగా అదనపు టీఎంసీ వరద కాలువ తవ్వకం కోసం అధికారులు భూసేకరణ చేపట్టారు. ఆచంపల్లి, తాడిజెర్రి గ్రామాల రైతులు ఇప్పటికే కోర్టులో కేసు వేసి స్టే తెచ్చుకుని భూసేకరణను నిలుపుదల చేశారు. అదే బాటలో కొండన్నపల్లి రైతులు కూడా వెళ్లడానికి సమాయత్తమై ఆందోళనను ఉధృతం చేశారు. ప్రస్తుతం ఉన్న వరద కాలువను వినియోగించుకుని మిడ్ మానేరుకు నీరును తరలించాలి.. అదనపు టీఎంసీ భూసేకరణను ఆపాలని రైతులు కోరుతున్నారు.
ఉన్న భూమంతా ఊడ్చుకుపోయింది
వరద కాలువలు, రైల్వే లైన్ల నిర్మాణాల్లో భూములు ఊడ్చుకుపోతున్నాయి. ఇప్పటికే బతుకుదెరువు లేకుండా పోగా.. ఉన్న కాస్త భూమిని కోల్పోతే వీధిన పడుడే. నాకు ఐదెకరాల భూమి ఉండగా, గతంలో వరద కాలువలో ఎకరన్నర పోయింది. ఇప్పుడు అదనపు టీఎంసీ భూసేకరణలో మూడెకరాలు పోతోంది. అంతా పోయి అర ఎకరం మిగిలితే వ్యవసాయ రంగంపై ఆధారపడి బతుకుతున్న నేను, నా కుటుంబం పరిస్థితి ఏం కావాలి.
- తొర్రికొండ భూపతి, కొండన్నపల్లి
బతుకుదెరువు ఏదీ..?
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల బతుకుదె రువు లేకుండా పోతోంది. ఇప్పటికే రెండెకరాలను కోల్పోయాం. అదనపు టీఎంసీ వరద కాలువలో మరో రెండెకరాలను కోల్పోతున్నా. ఉన్న ఆరెకరాల్లో నాలుగెకరాలు కోల్పోతే మా పరిస్థితి ఏంటి? ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సింది పోయి అవస్థలు పెడుతోంది.
- ఉప్పుల కనుకయ్య, కొండన్నపల్లి
ఎంత పరిహారమిచ్చినా భూములివ్వం...
భూములు కోల్పోయి ఇప్పటికే కష్టాలు పడుతుంటే మళ్లీ.. అదనపు టీఎంసీ పేరిట భూములు లాక్కోవడానికి ప్రభుత్వం భూసేకరణ అంటోంది. నష్ట పరిహారం ఎంత ఇచ్చినా భూములు, ఇండ్లు ఇచ్చేది లేదు. వరద కాలువ, రైల్వేలైన్లలో ఇప్పటికే మా గ్రామ రైతులం 400ఎకరాలు కోల్పోయాం. మా ప్రాణం పోయినా భూములిచ్చేది లేదు. వ్యవసాయమే జీవనాధారమైన తాము.. అదీ కోల్పోయి కూలీలుగా, నిరాశ్రయులుగా మారితే మా పరిస్థితేంటి.. ప్రభుత్వం పునరాలోచించాలి.
- రేండ్ల రాజిరెడ్డి, కొండన్నపల్లి