Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటోంది
- మరో విద్యుత్ ఉద్యమం వస్తుంది.. కేసీఆర్ ఖబర్దార్
- సీపీఐ(ఎం) జనగామ జిల్లా మహాసభలో తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-జనగామ
దేశ ప్రజలకు బీజేపీయే ప్రధాన శత్రువని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. దేశంలో మతవిద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. సీపీఐ(ఎం) జనగామ జిల్లా ద్వితీయ మహాసభలు జనగామ పట్టణంలోని వైష్ణవి గార్డెన్లో (అంబటి సత్యనారాయణ హాల్) మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పాలనలో రైతులు, కార్మికులు, విద్యార్థులు, అసంఘటిత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన రైతు ఉద్యమంలో అనేకమంది ప్రాణత్యాగాలు చేసినా వెనక్కి తగ్గకుండా రైతులంతా ఏకమై ఉద్యమించారనీ, దాని ఫలితమే.. చట్టాలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో విజయం సాధించారని తెలిపారు. కేంద్రం ఇప్పటికైనా విధివిధానాలను మార్చుకొని ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో రాజకీయ స్వాతంత్రం తప్ప ఆర్థిక స్వాతంత్రం లేదన్నారు. మత పెద్దలుగా చెలామణి అవుతున్న వారు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయడం సరికాదన్నారు. దేశమంతా మతోన్మాద ఘర్షణలు చెలరేగేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. నిరుద్యోగులకు ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేందుకు యత్నిస్తే.. మరో విద్యుత్ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుపై చిత్తశుద్ధి ఉంటే సీఎం కేసీఆర్ అన్ని పార్టీలను తీసుకుని ఢిల్లీకి వెళ్లాలని సూచించారు. ఈ విషయంలో సీపీఐ(ఎం) ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల అవకతవకలతో విద్యార్థులు బలయ్యారనీ, విద్యార్థి సంఘాల పోరాటంతోనే ప్రభుత్వం దిగొచ్చి విద్యార్థులందరినీ పాస్ చేసిందని గుర్తుచేశారు. బీజేపీ, టీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి ప్రజలందరూ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అనంతరం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య, జి. నాగయ్య మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నదనీ, భవిష్యత్ అంతా ఎర్రజెండాలదేనని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు పరిపాలించే వివిధ రాష్ట్రాలు, దేశాల్లో అభివృద్ధిలో ముందంజలో ఉన్నారని తెలిపారు. కేరళలో విద్య, వైద్యం పేదవారికి అందుబాటులో ఉందని చెప్పారు.
కరోనా కట్టడిలో కేరళ ప్రభుత్వం అనేక సహాయ చర్యలు తీసుకుందనీ, అందుకే అభివృద్ధిలో దేశంలో గర్వించదగ్గ రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. సీఎం పినరయి విజయన్ పాలన అద్భుతంగా ఉందని కేంద్ర ప్రభుత్వమే గుర్తింపు ఇచ్చిందన్నారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టేందుకు భవిష్యత్తులో అనేక ఉద్యమాలు నిర్మించేందుకు ఈ మహాసభ వేదిక కావాలని తెలిపారు. మహాసభలో సీపీఐ(ఎం) జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, ఏఐఆర్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శ్రీనివాస్, ఇర్రి అహల్య, ఎద్దునూరి వెంకటరాజ్యం, సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ళబండి శశిధర్తోపాటు జిల్లా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.