Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా నవాబ్‌పేట్ రిజర్వాయర్ డిస్టిబ్యూటరీ కెనాల్ నిర్మాణం నిమిత్తం ఇద్దరు రైతులకు చెందిన భూమిని సేకరించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 2018లో భూసేకణ నోటిఫికేషన్ ఇచ్చారనీ, ఏడాది వరకూ నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా గండాల మండలం రామారమ్ రైతులు వెంకటరెడ్డి, మహిపాల్ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ వినోద్‌కుమార్ విచారించి స్టే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది రైతుబంధు డబ్బులు కూడా ప్రభుత్వం ఇచ్చిందనీ, రైతుల నుంచి భూమిని చట్ట ప్రకారం సేకరించే వరకూ నోటిఫికేషన్‌ను అమలును నిలిపివేయాలని న్యాయవాది కోరారు. అనంతరం హైకోర్టు.. ఇద్దరి రైతుల భూములను అధికారులు సేకరణ చేయరాదని స్టే ఇచ్చింది. భూసేకరణ అధికారి కౌంటర్ దాఖలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. విచారణను ఫిబ్రవరి 4కి వాయిదా వేసింది.
బెయిల్ రద్దు చేయాలి
బెయిల్ ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తున్న శ్రీక్రిష్ణ జ్యుయలర్స్ డైరెక్టర్ ప్రదీప్‌కుమార్‌కు బెయిల్ రద్దు చేయాలని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెంట్ (డీఆర్ఐ) దాఖలు చేసిన కేసును మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత విచారించారు. బంగారం స్మగ్లింగ్ కేసు దర్యాప్తు ఏ దశలో ఉందో, బెయిల్ రద్దుకు కారణాలను వివరించాలని డీఆర్ఐని ఆదేశించింది. రూ.600 కోట్ల విలువైన 1,800 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసు నిందితుడు ప్రదీప్‌కుమార్ బెయిల్‌పై విడుదలయ్యాక కేసు దర్యాప్తునకు సహకరించడం లేదని డీఆర్ఐ న్యాయవాది వాదించారు. బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఆగస్టు 8న జారీ చేసిన సమన్ల మేరకు సెప్టెంబర్ 1న విచారణకు వెళ్లలేకపోవడానికి ఆయన ప్రయాణంలో ఉన్నారని ప్రదీప్‌కుమార్ న్యాయవాది చెప్పారు. విచారణ జనవరి 4కి వాయిదా పడింది.
జగన్ కేసులో లేపాక్షి రిట్ ఉపసంహరణ
వైఎస్ జగన్ అక్రమాస్తులపై సీబీఐ పెట్టిన కేసును కొట్టేయాలన్న రిట్‌ను లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ను వెనక్కి తీసుకుంది. సీబీఐ నమోదు చేసిన కేసును లేపాక్షి నాలెడ్జ్ హబ్ డైరెక్టర్ శ్రీనివాస బాలజీ వాపస్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాది కోరారు. రిట్‌ను కొట్టేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. జగన్ ఆస్తుల కేసులో మరో నిందితుడు రిటైర్డు ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య దాఖలు చేసిన రిట్‌పై కూడా విచారణ జరిగింది. అవినీతి నిరోధక చట్టంలో రద్దయిన సెక్షన్ల కింద నమోదు చేసిన చార్జిషీట్‌ను సిబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోవడం చట్ట వ్యతిరేకమన్నారు. స్టే ఉన్నా సీబీఐ కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకోవడం చెల్లదన్నారు. విచారణ బుధవారానికి వాయిదా పడింది.