Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు, సిబ్బందికి మంత్రి హరీశ్ రావు అభినందనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా వ్యాక్సిన్ మొదటి డోసును వంద శాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. దీన్ని పురస్కరించుకొని కోఠిలోని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వ్యాక్సినేషన్ విజయవంతం చేయటంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపించారనీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకరించారని తెలిపారు. టీకా వేసేందుకు 44 కేటగిరీలుగా గుర్తించి 7,970 వ్యాక్సినేషన్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇంటింటికి సిబ్బంది తిరుగుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పరిధిలో 3,500, ప్రయివేటులో 264 కేంద్రాల్లో 10 వేల మంది వ్యాక్సినేటర్లు, 35 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని వెల్లడించారు. రెండో డోసు 66 శాతం మందికి పూర్తయిందని తెలిపారు.
ముందుగా మున్సిపాల్టీల్లో.....
జనవరి మూడు నుంచి 15-18 వయస్సు వారికీ, జనవరి 10 నుంచి 60 ఏండ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ముందుగా హైదరాబాద్ తో పాటు మున్సిపాల్టీల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆపై స్థాయి ఆస్పత్రులున్న చోట ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకోసం అర్హులైన వారు కోవిన్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు 15 నుంచి 18 ఏండ్లలోపు వారికి కోవాగ్జిన్, 60 ఏండ్లు పైబడిన వారికి అంతకుముందు తీసుకున్న డోసులనే ఇస్తారని స్పష్టం చేశారు.
టీకా వేసుకోని 46 మందికి ఒమిక్రాన్
రాష్ట్రంలో ఇప్పటి వరకు 62 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో 46 మంది ఇతర దేశాలకు చెందిన వారుండగా, నాలుగు కాంటాక్టు కేసులు, మరో మూడు ఎలాంటి ప్రయాణ చరిత్ర లేని వారు. ఈ వేరియంట్ బయటపడ్డ వారిలో 46 మంది వ్యాక్సిన్ వేసుకోని వారేనని హరీశ్ రావు స్పష్టం చేశారు.
హెల్త్ ఇండెక్స్‌లో ఉత్తర్ ప్రదేశ్‌ది చివరి స్థానం
ఆరోగ్య సూచీలో డబుల్ ఇంజన్ గ్రోత్‌గా చెప్పుకుంటున్న ఉత్తర ప్రదేశ్ చిట్టచివరి స్థానంలో నిలిచిందని హరీశ్‌రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రం వైద్య రంగంలో దూసుకుపోతున్నదని చెప్పారు. నిటి అయోగ్ నివేదిక మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు.