Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్లో 4.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థీరీకరణ
- చెప్పిందొకటి..చేస్తున్నదొకటి !
- పెరుగుతున్న అంచనా వ్యయం
- ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సీఎం కేసీఆర్ పరిపాటిగా ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే చేపట్టిన మాట అందరికి ఎరుకే. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకే సర్కారు ప్రాధాన్యతిస్తోంది. ఆయకట్టును పెంచడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామంటూ గులాబీ పెద్దలు సభలు, సమావేశాల్లో తరచూ వల్లేవేస్తూనే ఉంటారు. ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయబోమనీ, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తిచేస్తామని హామీని సైతం ఇచ్చింది. కానీ, అది ఆచరణలో బుట్టదాఖలైంది. ఆ ప్రాజెక్టుల పట్ల అలసత్వం కనిపిస్తున్నది. నిర్లక్ష్యం చేస్తున్నది. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రతియేటా రూ. 25 వేల కోట్లను సాగునీటి ప్రాజెక్టులకు కేటాయిస్తామని చెప్పారు. ఒక్క ఏడాదే అలా చేశారు. ఆ తర్వాత నిధులను తగ్గించారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా నిధులు సమకూర్చు కున్నారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆ తరహాలోనే కాసులు తెచ్చుకున్నారు. 18 భారీ, 31 మధ్యతరహా ప్రాజెక్టులపై శీతకన్నేశారు. కేటాయింపులు చేస్తున్నామంటూనే ఏ ఒక్క ప్రాజెక్టును ఏడేండ్లుగా పూర్తిచేయకపోవడం గమనార్హం. కొన్ని ప్రాజెక్టులకు రీడిజైన్ చేశారు. గత ఏడేండ్లల్లో మధ్యతరహా ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఉన్నా, ఆ ప్రణాళికే లేదు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 4.40 లక్షల ఎకరాలకు సాగునీరందించే శ్రీరాంసాగర్(ఎస్ఆర్ఎస్పీ) ప్రాజెక్టు రెండో దశ పనులు ఇంకా ఆలస్యమవడమే ఇందుకు సాక్షం.
రెండోదశ ..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ పనులు పూర్తిచేస్తే ఖమ్మం జిల్లాలోని 68,914 ఎకరాలు, వరంగల్లోని 1,13,575 ఎకరాలు, నల్లగొండ జిల్లాలోని 2,57,508 ఎకరాల ఆయకట్టు స్థీరీకరణ జరుగుతుంది. తద్వారా ఈ మూడు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయి. ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ పనులు పూర్తయినా, నీటిని పంపిణీ చేసే ఉపకాలువల పనులు ఇంకా ఆలస్యమవుతూనే ఉన్నాయి. ఈ రెండో దశకు 40 టీఎంసీల నీరు అవసరం. ఈ నీరు శ్రీరాంసాగర్ కాకతీయ కాలువ ద్వారా దిగువకు రావడం గత దశాబ్ధకాలంలో సాధ్యం కానిది. కాకతీయ కాలువకు 234వ కిలోమీటర్ వరకే నీరు వస్తున్నది. మొదటి దశలోని 234-284 కిలోమీటర్లకు కూడా నీరందడంలేదు. పై 50 కిలోమీటర్లల్లో మోరంచ, తీగలవేని, వెన్నవరం కాలువలకు కూడా నీరు రావడం లేదు. 284 నుంచి 343 కిలోమీటర్ల వరకు గత రెండు దశాబ్దాలుగా నీళ్లు రాలేదు. కాళేశ్వరం ద్వారా స్థీరీకరిస్తామని చెప్పినా, అమలుకాలేదు. కాలువలు పూర్తయినా ఇప్పుడవి శిథిలావస్థకు చేరుకున్నాయి. కాకతీయ కాలువ మొదటి దశ 50 కీలోమీటర్లతోపాటు రెండో దశకు 70 టీఎంసీల నీరు కావాల్సి ఉంటుంది. ఈ నీటిని దేవాదుల లిఫ్ట్ ద్వారా గానీ, లేదా కాంతాలపల్లి ఎత్తిపోతల ద్వారాగానీ సరఫరా చేయడానికి వీలుంది. ఇదొక్కటే మార్గం. ఈ ప్రాజెక్టులతో రెండో దశకు నీటిని అందించడం ద్వారా మాత్రమే శాశ్వత ప్రయోజనం కలుగుతుంది. అలాగే రెండో దశలోనే సరస్వతి కాలువ ద్వారా 79000 ఎకరాలు( 77-144 కిలోమీటర్లు), కడెం ఆయకట్టు స్థీరీకరణ 68000 ఎకరాలనూ చేర్చారు.
శంకుస్థాపనలు
ఈ ప్రాజెక్టు రెండోదశకు మూడుసార్లు శంకుస్థాపనలు జరిగాయి. అప్పటి మాజీ ప్రధాని కి.శే ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి కి.శే ఎన్టీఆర్తో కలిసి 1984, మే నాలుగో తేదీన శంకుస్థాపన చేశారు. కాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం 1996, మార్చి ఆరున ఒకసారి, 2002 మే తొమ్మిదిన రెండోసారి శంకుస్థాపన చేయడం గమనార్హం. తొలుత ఈ ప్రాజెక్టు వ్యయం సాగునీటి పారుదల, ఆయకట్టు శాఖ రూ. 1258 కోట్లుగా నిర్ధారించింది. ప్రధాన ఉపకాలువలు డీబీఎం 30, డీబీఎం 40, డీబీఎం 48 కాలువలు తవ్వినా లైనింగ్ చేయలేదు. చేసినవీ కూలిపోయాయి. ఇప్పటికీ వీటి పునరుద్ధరణకు ప్రణాళికలే లేవు. పదేండ్లపాటు కాలువల తవ్వకాలను నిర్లక్ష్యం చేశారు. అనంతరం కొద్దిమేర కదలిక వచ్చింది. నిధులిచ్చారు. వాటినీ కాంట్రాక్టర్లు, అవినీతి అధికారులు కాజేశారు. పనులు చేయకుండానే చేసినట్టు ఎంబీలు నమోదు చేసి విలువైన ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో దాదాపు 12 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల(ఏఈ)ను అప్పట్లో ప్రభుత్వం సస్పెండ్ చేసిది. కాగా ఎలాంటి విచారణ చేయకుండానే సస్పెండైన ఏఈలను మూడేండ్ల తర్వాత మళ్లీ విధుల్లోకి తీసుకోవడం అప్పట్లో భారీ చర్చకు దారితీసింది.
ఏం చేయాలి...?
ఖమ్మం జిల్లా 68,914 ఎకరాలకు నీరిచ్చేందుకు పాలేరు నుంచి భక్తరామదాసు లిఫ్ట్పెట్టారు. పాలేరు ఆయకట్టుకు కృష్ణానదీ నుంచి ఇస్తున్నారు. కానీ, భక్తరామదాసు లిఫ్ట్ ద్వారా ఖమ్మం జిల్లాలోని గోదావరి ఆయకట్టుకు మళ్లించారు. గోదావరిలో సరిపోను నీళ్లు ఉన్నాయి. కాకతీయ కాలువ ద్వారా ఇచ్చే అవకాశం ఉంది. కృష్ణాకు లింకుపెట్టి ఖమ్మంలో పబ్బంగడిపారు. రెండోదశకు ఇప్పటికీ నీటి కేటాయింపుల గ్యారంటీ లేదు. కరీంనగర్, వరంగల్ సరిహద్దు వరకు మొదటిదశ శ్రీరాంసాగర్ నీళ్లు వస్తున్నాయి. కిందకు వదలడంతో వరంగల్ నగరానికి తాగునీటిని అందిస్తున్నారు. వడ్డేపల్లి, భద్రకాళి చెరువును నింపుతున్నారు. దేవాదుల ప్రాజెక్టుతో ధర్మసాగర్ చెరువు నీటిసమస్య తీరుతున్నది. కానీ రెండో దశకు నీళ్లీవ్వడంపై 1984 నుంచి దృష్టిపెట్టలేదు. డీబీఎం 48ను నిర్మించాల్సి ఉంది. 4.40 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రాంతం నిరంతరం నీటి కరువుతో ఉంది. వర్థన్నపేట, తిరుమలగిరి, వరంగల్, ఖమ్మం మూసీ ప్రాంతానికి ఇప్పటికీ సక్రమంగా తాగు, సాగనీరు అందడం లేదంటే ప్రణాళికబద్దమైన వ్యవహారం లేకపోవడమే కారణం.
కాలువల పనులు
శ్రీరాంసాగర్ రెండో దశకు నీటి గ్యారంటీ లేదు. పంపిణీచేసే కాలువల పనులు చేయాల్సి ఉంది. అదనంగా నిధులూ అవసరమవుతాయి. మరో రూ. 1000 నుంచి రూ. 1200 కోట్లు కావాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం వీటిని కేటాయించాల్సి ఉంది. అది పూర్తిచేయకుండానే వరదనీటితో నీళ్లు ఇస్తామని చెప్పడం సరికాదని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. మొదటి దశ ప్రాంతంలో రెండో పంట నీళ్లను ఆపి శ్రీరాంసాగర్ రెండో దశ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే డిమాండ్ ముందుకొచ్చింది. గత ప్రభుత్వాలు గోదావరి నదీపై ఉన్న కాంతాలపల్లి, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా కనెక్షన్లు ఇచ్చి కాకతీయ కాలువకు నీళ్లు ఇస్తామన్నా చెప్పి, దాన్నీ పట్టించుకోలేదు. ఇప్పుడు కాంతాలపల్లిని ఎత్తేసి తుపాకులగూడెం చేపట్టారు. దీంతోనైనా కూడా శ్రీరాంసాగర్ రెండో దశ స్థీరీకరణకు గోదావరి నీళ్లను లిఫ్ట్ ద్వారా ఇస్తామన్న హామీ నెరవేర్చాలనే డిమాండ్ వస్తున్నది.