Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది మందికి అస్వస్థత
- ఇద్దరి పరిస్థితి విషమం.. ఆర్వీఎంకు తరలింపు
నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
మెదక్ జిల్లాలోని తూప్రాన్, శివ్వంపేట మండలాల్లో కల్తీ కల్లు కలకలం రేపింది. కల్లు తాగిన తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తూప్రాన్‌లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వరాల ప్రకారం.. శివ్వం పేట మండలంలోని కొంతాన్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్ కల్లు వ్యాపారి.. తూప్రాన్ మండలంలోని వట్టూర్‌లో కల్లు దుకాణాన్ని లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తున్నాడు. అతనికి కొంతాన్‌పల్లిలో మరో కల్లు దుకాణం ఉంది. రోజూలాగే సోమవారం కొంతాన్‌పల్లి దుకాణంతో పాటు వట్టూరు దుకాణానికి కల్లును తరలించారు. వట్టూరుకు చెందిన పాం బండ శివకుమార్, చండి యాదగిరి, కుర్మ కొమురయ్య.. కొంతాన్‌పల్లిలో గుండ్లపల్లికి చెందిన మహేష్, కొంతాన్‌పల్లికి చెందిన నాగరాజు, బ్యాగరి మనీల, రమేష్, వీరబోయిన స్వామి, వెంకటేష్ సోమవారం సాయంత్రం కల్లు తాగారు. కల్లు తాగిన తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురై కాళ్లు, చేతులు వంకర కావడం, నాలుక మందం కావడం, మెడలు వంకర కావడం లాంటి పరిస్థితి నెలకొంది. దాంతో వెంటనే వారిని తూప్రాన్‌లోని ప్రయివేటు ఆస్పత్రులకు తరలించారు. వారిలో నాగరాజు, వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సిద్దిపేట జిల్లాలోని ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు.
కల్లు దుకాణాలను తనిఖీ చేసిన టాస్క్‌ఫోర్స్ సీఐ
మెదక్ జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో కల్లు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. సోదాలు నిర్వహించి కల్లులో ఎలాంటి రసాయనాలూ కలపలేదని కల్తీ లేదని, నిజామాబాద్‌లోని ల్యాబ్‌కు తరలిస్తున్నామన్నారు. పరీక్షల అనంతరం కల్లులో ఏమైనా కల్తీ జరిగినట్టు తేలితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ కృష్ణయ్య తెలిపారు.