Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 317 సవరణ కోసం నిర్బంధాలను చేధించుకుని పట్నం చేరిన ఉపాధ్యాయులు
- జీహెచ్ఎంసీ, తెలుగుతల్లి ప్లైఓవర్ వద్ద తోపులాట, అరెస్టులు
- పలు స్టేషన్లకు తరలించిన పోలీసులు
- రాత్రి వరకూ విడిచిపెట్టని వైనం
- హైదరాబాద్‌కు టీచర్లు రాకుండా రాత్రి నుంచే అడ్డగింత
- న్యాయం కావాలంటూ టీచర్ల నినాదాలు
- ముట్టడి విజయవంతమైంది : యుఎస్పీసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీవోనెంబర్ 317ని సవరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) సచివా లయ ముట్టడి విజయవంత మైంది. రాష్ట్ర సర్కారు సోమవారం అర్ధరాత్రి నుంచే జిల్లాల్లో టీచర్లను గృహ నిర్బం ధాలు చేసినా.. హైదరాబాద్ చేరే క్రమంలో అడుగడుగునా అడ్డుకున్నా తాము తలపెట్టిన కార్యక్రమాన్ని ఉపా ధ్యాయులు వ్యూహాత్మకంగా జయప్రదం చేశారు. దశలవారీగా సచివాలయ ముట్టడి యత్నించగా.. పోలీసులు వచ్చినవారిని వచ్చినట్టే అరెస్టు చేశారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్, జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద పోలీసు లకు, టీచర్లకు మధ్యతోపులాట జరిగింది. దీంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పిల్లాపా పలతో సచివాలయ ముట్టడికి వచ్చిన మహిళా టీచర్లను కూడా పోలీసులు వదలలేదు. అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. రాత్రి వరకూ విడిచిపెట్టలేదు. దీంతో అక్కడా టీచర్లు-పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.
తెలుగుతల్లి ప్లైఓవర్ వద్ద నినాదాలు..అరెస్టులు
సచివాలయ ముట్టడికి మంగళవారం హైదరాబాద్ కు వచ్చిన వందలాది మంది టీచర్లు తెలుగు తల్లి ప్లైఓవర్ వద్ద పోగై 'స్వరాష్ట్రంలో పరాయి వాళ్లను చేయొద్దు... బలవంతపు బదిలీలొద్దు...తప్పుల తడక జీవో 317 మాకొద్దు...వెంటనే సవరించాలి' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతిలో పట్టుకుని బీఆర్కే భవన్ వైపు దూసుకెళ్లేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఒకేసారి ఇరువైపుల నుంచి ముందుకు దూసుకెళ్లేందుకు టీచర్లు యత్నించగా పోలీసులు అడ్డున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, టీచర్లకు మధ్య తోపులాట జరిగింది. మరో బృందం పోలీసుల కండ్లుగప్పి జీహెచ్ఎంసీ కార్యాలయం వరకూ చేరుకున్నది. బీఆర్కే భవన్‌లోకి వెళ్లేందుకు టీచర్లు యత్నించారు. వారినీ పోలీసులు అరెస్టు చేశారు. ఇలా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు టీచర్లు విడతల వారీగా సచివాలయ ముట్టడికి వచ్చారు. సచివాలయం వెళ్లే రూట్లలో అడుగడుగునా పోలీసులను పెద్దఎత్తున మోహరించారు.
సచివాలయ ముట్టడి కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ నాయకులు కె.జంగయ్య, చావ రవి (టీఎస్‌యూటీఎఫ్), మైస శ్రీనివాస్ (టీపీటీఎఫ్్), ఎం.రఘుశంకర్‌రెడ్డి, టి.లింగారెడ్డి( డీటీఎఫ్˜్), యు.పోచయ్య (ఎస్టీఎఫ్), ఎన్ యాదగిరి (బీటీఎఫ్), ఎస్ హరికృష్ణ(టీటీఎ), బి.కొండయ్య, ఎస్.మహేష్ (ఎంఎస్టీఎఫ్), చింతా రమేష్ (ఎస్సీఎస్టీయుయస్), టి.విజయసాగర్(టీజీపీఈటీఏ), వై.విజయ కుమార్ (ఎస్సీఎస్టీ యుయస్టీఎస్), తదితరులు నాయకత్వం వహించారు. వీరితోపాటు యుయస్పీసీ భాగస్వామ్య సంఘాల జిల్లా, మండల నాయకులు, మహిళలతో సహా పలువురు ఉపాధ్యాయులు అరెస్టు అయిన వారిలో ఉన్నారు. జిల్లాల్లో యుయస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు జాడి రాజన్నతో సహా పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులను అర్థరాత్రి, తెల్ల వారుజామున స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు లు చేసి భయభ్రాంతులకు గురిచేశారని యుఎస్పీసీ నాయకులు తెలిపారు.
సచివాలయ ముట్టడి విజయవంతం: యుఎస్పీసీ
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్పీసీ) పిలుపు మేరకు సచివాలయం ముట్టడి కార్య క్రమం విజయవంతమైందని పోరాట కమిటీ నేతలు ప్రకటించారు. ఉపాధ్యాయులను సొంత రాష్ట్రంలో నూ పరాయివాళ్ళుగా మారుస్తున్న జిఓ 317 ను సవరించాలనీ, సీనియారిటి జాబితాలను సక్రమంగా రూపొందించాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక ప్రాతిపదికన పాఠశాలలు కేటాయించి సాధారణ బదిలీల్లో శాశ్వత నియామకాలు చేపట్టాలనీ, భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలని కోరారు. వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.