Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి
- సూచనలు, సలహాల కోసం అఖిలపక్షం ఏర్పాటు చేయండి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజల మీద విద్యుత్ చార్జీల పేరిట భారాన్ని మోపే ప్రతిపాదనలను డిస్కామ్‌లు ఉపసం హరించుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుచ్ఛక్తి ఆదాయ లోటును భర్తీ చేసుకోవడానికి, పేదలపై భారాలు పడకుండా తగిన సూచనలు, సలహాలు తీసుకోవడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యుచ్ఛక్తి డిస్కామ్‌లు తమ ఆదాయవ్యయాలను రెగ్యులేటరీ కమిషన్‌కు ఇస్తూ రు.11వేల కోట్లు భారాలు వేయాలని ప్రతిపాదించడాన్ని ఖండిం చారు. అందులో రూ.7 వేల కోట్ల భారాన్ని వినియోగదార్లపై వేయాలనీ, మిగిలిన రూ.4 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని సూచించడం సరిగాదని పేర్కొన్నారు. మూడేండ్లుగా ఆదాయ-వ్యయ నివేదికను రెగ్యులేటరీ కమిషన్‌కు పంపకుండా డిస్కామ్‌లు ఏం చేశాయని ప్రశ్నించారు. వాటి లోపం వల్ల లోటు రూ.22 వేల కోట్లు పెరిగిందని తెలిపారు. విద్యుత్ప్రసారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, తదితర ప్రధాన కారణాలతో వస్తున్న లోటును వినియోగదారులపై వేయడం అన్యాయమని పేర్కొన్నారు. గృహ వినియోగానికి యూనిట్‌కు రూ.1.45 నుంచి రూ. 1.95లకు, ఆపైన కూడా అదే దామాషాలో పెంచాలని సూచించడం దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో 1.53 కోట్ల సర్వీసులుండగా అత్యధికంగా 1.40 కోట్ల సర్వీసులపై భారాలు మోపుతున్నారని తెలిపారు. గృహ వినియోగదారులపై రూ.2100 కోట్ల భారం వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పన్నులు పెంచడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయనీ, దీనికి తోడు విద్యుత్ భారాలతో ప్రజల ఆర్థిక స్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పేదలు విద్యుత్తు వినియోగానికి దూరమవుతారని వాపోయారు. ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న గృహవినియోగ భారాల పెంపుదలను ఉపసంహరింపజేసుకోవాలని డిమాండ్ చేశారు.