Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుస్తకాన్ని బతికించండి
- రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి : బుక్‌ఫెయిర్ ముగింపు సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలుగురాష్ట్రాల్లో మరో గ్రంధాలయ మహౌద్యమం అవ సరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ''ప్రతి గ్రామంలో గతంలో గ్రంధాలయాలు ఉండేవి. అనేకమంది దాతలు వాటిని నిర్మించేవారు. ఇప్పుడు వాటి ఉనికే లేకుండా పోతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. పుస్తకాన్ని బతికించాలి'' అని చెప్పారు. సభలు, సమావేశాలు, స్కూళ్లు, కళాశాలల్లో పూల బొకేలు, శాలువాలు, సన్మానాలను పక్కనపెట్టి, పుస్తకాలను బహుమతులుగా ఇవ్వండ.ి పుస్తకాన్ని బతికించండి. కొనండి. చదవండి. బహుమతిగా ఇవ్వండి. విజ్ఞానాన్ని పంచండి అని చెప్పారు. 34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన-2021 ముగింపు కార్యక్రమం మంగళవారంనాడిక్కడ జరిగింది. దీనికాయన ముఖ్య అతిధిగా వచ్చి ప్రసంగించారు. పుస్తకం బతుకే ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన చెందుతున్న సమయంలో బుక్‌ఫెయిర్‌కు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో కొత్త ఆశాలు చిగురిస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారనీ, ఇప్పుడు సెల్‌ఫోన్ హస్తభూషణంగా మారిందన్నారు. ప్రతి స్కూలు, కళాశాలలో లైబ్రరీ, ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలనీ, ఇప్పుడు నిబంధనల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకాలు చదివితే అక్షరాలు మెదడులో ప్రింట్ అవుతాయనీ, అవి కలకాలం గుర్తుండిపోతాయని చెప్తూ, బాల్యసంఘటనలను గుర్తుచేసుకున్నారు. గోర్కీ రాసిన 'అమ్మ' నవల, వట్టికోట అళ్వారుస్వామి రాసిన 'ప్రజల మనిషి' పుస్తకాల ప్రభావం తనపై ఉందన్నారు. ఉత్తరాలు రాసే అలవాటు పూర్తిగా పోయిందనీ, దాని పునరుద్ధరింపచేయాలని ఆకాంక్షించారు. పెరిగిన టెక్నాలజీ ఉద్యోగాలకు పనికొస్తుందే తప్ప, విజ్ఞానానికి కాదనీ, అది పుస్తకపఠనం ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. 1930 నుంచి మహాకవి శ్రీశ్రీ కవితాలు రాసేవారనీ, 1950లో 'మహాప్రస్థానం' తర్వాతే ఆయనకు గుర్తింపు వచ్చిందనీ, నేటికీ ఆ కవితాలు అందరికీ గుర్తుండిపోయాయని చెప్పారు. పుస్తకాలకు మద్దతు ఇవ్వడం అంటే మనకు మనం మద్దతు ఇచ్చుకోవడమేనని విశ్లేషించారు. కాఫీ కంటే ఎక్కువ కిక్ ఇచ్చే పుస్తకాలు అనేకం ఉన్నాయని చమత్కరించారు. పైరసీ నేరగాళ్లకు కఠిన శిక్షలు వేయాలని తాను న్యాయమూర్తులకు సూచిస్తాననీ, ప్రచురణ కర్తల కష్టాలు తనకు తెలుసునని అన్నారు. తెలుగులో కోర్టు తీర్పులు ఇవ్వాలనే ప్రయత్నం గతంలో జరిగి నిలిచిపోయిందనీ, మరోసారి దాన్ని కార్యాచరణలోకి తీసుకొస్తే బాగుంటుందనీ, ఈ మేరకు తాను హైకోర్టు న్యాయమూర్తులకు లేఖలు రాస్తానని తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత తానుకూడా పుస్తకం రాస్తానని చెప్పారు. కార్యక్రమానికి బుక్ఫె యిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ స్వాగతోపన్యా సం చేయగా, అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ అధ్యక్షత వహించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కార గ్రహీత కురెళ్ల విఠలాచార్య, బుక్‌ఫెయిర్ కోశాధికారి పి రాజేశ్వరరావు వందన సమర్పణ చేశారు.