Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలకంటి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల ఎకరాల్లో మిర్చి పంట తామర వైరస్, బొబ్బెర ముడత, కంపు నల్లి తెగుళ్ళు సోకడంతో పెద్ద ఎత్తున పంట దెబ్బతిన్నదని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల ప్రకారం 10 నుంచి 15 మార్లు పురుగు మందులు కొట్టినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఒక్కో ఎకరానికి రూ.లక్షన్నరకు పైగా అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్లో అధికంగా మిర్చి వేశారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా తెగుళ్ళ కారణంగా పెద్ద ఎత్తున పంటకు నష్టం జరిగిందనీ, ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి, మంత్రులు వీటిని పరిశీలించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారని జూలకంటి తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కదిలి పంట నష్టాన్ని అంచనా వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించి ప్రతి ఎకరానికి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించడం ద్వారా రైతులను ఆదుకోవాలని కోరారు.