Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీహెచ్ఎంసీతో పాటు మరికొన్ని జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో గత నాలుగు రోజులుగా వరసగా 69, 90, 110, 121 మంది వైరస్ బారిన పడ్డారు. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో 10, 17, 19, 31 చొప్పున పెరుగుతూ వచ్చాయి. ఇక మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలో ఆరు, ఏడు నుంచి 11, 20, 23గా రోజువారీగా కేసులు రావడం గమనార్హం. ఇక సంగారెడ్డి జిల్లాలో ఐదు రోజుల క్రితం ఒక్క కేసు మాత్రమే రాగా బుధవారం ఆరు బయటపడ్డాయి. ప్రజలు గుమిగూడిన చోట ఈ పెరుగుదల ఎక్కువగా ఉంటున్నట్టు వైద్యాధికారులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో 235 మందికి
రాష్ట్రంలో కొత్తగా 235 మందికి కరోనా సోకింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల నుంచి బుధ వారం సాయంత్రం 5.30 గంటల వరకు 38,023 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. మరో 3,490 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,490 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 121 మందికి కరోనా సోకింది.
11 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో మంగళవారంతో పోలిస్తే బుధవారం జీహెచ్ఎంసీతో సహా 11 జిల్లాల్లో కేసు లు పెరిగాయి. కామారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్ - మల్కాజిగిరి,ములుగు, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, వరంగల్ రూరల్, హన్మకొండ జిల్లాల్లో పెరిగాయి.
ఎనిమిది జిల్లాల్లో తగ్గిన కరోనా
ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, నల్లగొండ, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తగ్గాయి. మరో 11 జిల్లాల కేసుల్లో ఎలాంటి మార్పు లేదు.
విదేశాల నుంచి 10 మంది....
బుధవారం ఒమిక్రాన్ ముప్పు దేశాలుగా గుర్తించిన విదేశాల నుంచి రాష్ట్రానికి 346 మంది వచ్చారు. వీరిలో 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. వీటితో కలుపుకుని 23 మంది నమూనాల రిపోర్టులు రావాల్సి ఉన్నవి. ఇప్పటి వరకు 62 మందిలో ఒమిక్రాన్ ఉన్నట్టు బయటపడగా వారిలో 18 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు.