Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సంక్షేమ పోలీసు వ్యాసాలు-నివేదికలు' పుస్తకావిష్కరణ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాటానికి నిరంతరం కృషి చేస్తున్న పోలీసుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధను వహిస్తున్నామని రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో పోలీసు కన్వెషన్ హాల్స్‌ను నిర్మిస్తున్నామని వెల్లడించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి రచించిన 'సంక్షేమ పోలీసు వ్యాసాలు-నివేదికలు' అనే పుస్తకాన్ని డీజీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర ఉద్యోగులతో పోలిస్తే పోలీసుల పని విధానం కొంత భిన్నమైంది, కఠినమైందని అన్నారు. ముఖ్యంగా, ప్రజలు సుఖశాంతులతో బతకడానికి అవసరమైన వాతావరణాన్ని సమాజంలో ఏర్పర్చడానికి పోలీసులు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులను సైతం పట్టించుకోలేని స్థితిలో పోలీసుల పని విధానం సాగుతున్నదన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల సంక్షేమం కోసం ఆరోగ్య భద్రత, భద్రత తదితర పథకాలను అమలు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. ముఖ్యంగా, ప్రతి పోలీసూ పదవి విరమణ నాటికి సొంత ఇంటి కలను నెరవేర్చడానికి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందజేస్తున్నామని మహేందర్ రెడ్డి తెలిపారు. సంక్షేమ పోలీసు వ్యాసాలు అనే ఈ పుస్తకం ప్రతి పోలీసు హ్యాండ్ బుక్ లాగా పని చేస్తుందని చెప్పారు. ప్రతి జిల్లాకూ ఈ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. సమాచారాన్ని సంపూర్ణంగా సేకరించి ఈ పుస్తకాన్ని రాసినందుకు రచయిత గోపిరెడ్డిని డీజీపీ అభినందించారు. రచయిత గోపిరెడ్డి మాట్లాడుతూ.. తాను రాసిన సంక్షేమ పోలీసు వ్యాసాలు అనే పుస్తకం పోలీసులకు, ప్రజలకు మధ్య మరింత సంబంధాలను మెరుగుపరుస్తుందని అభిప్రాయపడ్డారు. పోలీసులు ఎదుర్కొనే సమస్యలను కూడా ఈ వ్యాసాలు ప్రజల్లో అవగాహనను పెంచుతాయని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసున్నతాధికారులతో పాటు పోలీసు అధికారుల సంఘానికి చెందిన అన్ని జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు.