Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వింటా పత్తి రూ.9వేలు
నవతెలంగాణ-గాంధీచౌక్/కాశీబుగ్గ
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం తెల్లబంగారం(పత్తి) మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. మంగళవారం ఉదయం జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో గరిష్ట ధర క్వింటాల్ రూ.9వేలు పలికి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, వరంగల్ నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లోనూ మార్కెట్లో పత్తి ధర రూ.8800 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరగడంతో పక్షం రోజుల నుంచి అంచెలంచెలుగా పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. యార్డుకు పంట తక్కువ వస్తున్న నేపథ్యం, జాతీయ మార్కెట్లో తెలంగాణ పంటకు మంచి డిమాండ్ పలుకుతుండటంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఉదయం యార్డుకు సుమారు 4,914 పత్తి బస్తాలను ఆయా జిల్లాల నుంచి రైతులు తీసుకువచ్చారు. దాంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఖమ్మం మార్కెట్లోనే రికార్డు స్థాయి ధర పలకడానికి కారణమైంది. ఈ ఏడాది పత్తిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. పత్తికి బదులు మిర్చిసాగు పట్ల రైతులు ఆసక్తి కనబరిచారు. అదే సమయంలో మార్కెట్లో మంచి డిమాండ్ రావడంతో పత్తి రైతులకు కలిసి వచ్చినట్లైంది. ఈ ఏడాది పత్తి పంటకు సీసీఐ మద్దతు ధర క్వింటాల్ రూ. 8 వేలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రయివేటు మార్కెట్లో మద్దతు ధరకు మించి క్వింటాలు ఒక్కంటికి రూ.2,500 పైబడి పలుకుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.