Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పత్తి రైతుల ఆశలు ఆవిరి
- మార్కెట్లో రేటు ఉన్నా పెట్టుబడి రాని వైనం
- నట్టేటా మునిగిన కౌలు రైతులు
- పెట్టుబడి పెరగడంతో అప్పులు రెట్టింపు..
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
తెల్ల బంగారానికి ఈ ఏడాది బహిరంగ మార్కెట్లో మంచి ధర పలకడంతో పంట సాగు చేసి అప్పు తీర్చుదామని కలలు గన్న రైతుకు నిరాశే మిగిలింది. పంట పూత సమయంలో అధిక వర్షాలు పడటంతో పత్తి దిగుబడి భారీగా తగ్గడంతో రైతులకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పైగా ఈ ఏడాది పత్తి పంట సాగు వ్యయం గతం కంటే మరింత పెరగడంతో అప్పులు రెట్టింపు అయ్యాయి. కౌలు తీసుకుని పంట సాగు చేసిన రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పంట దిగుబడి రాకపోవడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా కట్టాలని కౌలురైతులు లబోదిబోమంటున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వర్షాధార వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది. ఆరుతడి పంటల్లో అత్యధికంగా పత్తి సాగు చేస్తారు. జిల్లాలో ఈ వానాకాలం 4.82 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతు న్నాయి. ఎకరాకు సుమారు 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా 2.41 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఇప్పటికీ 1.64 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి మాత్రమే వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది పత్తి దిగుబడి ఎట్టా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సొంత భూముల్లో పంట సాగు చేసిన రైతులకు పెట్టుబడులు రాలేదంటే.. ఇక భూమిని కౌలు తీసుకుని పంట పండించిన కౌలు రైతులు ఆందోళనగా ఉన్నారు. మాడ్గుల మండలం కొత్త బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మహిళా కౌలు రైతు గంగమ్మ ఎకరాకు రూ.6 వేల చొప్పున 8 ఎకరాలు కౌలుకు తీసుకుని నాలుగేండ్లుగా తన ఇద్దరి కుమారుల సాయంతో పత్తి సాగు చేస్తోంది. ఈ ఏడాది 8 ఎకరాల్లో పత్తి సాగు చేసింది. విత్తనాలు విత్తే సమయంలో వర్షాలు కురువకపోవడంతో విత్తనాలు రెండు దఫాలుగా విత్తాల్సి వచ్చింది. కేవలం విత్తనాలకే రూ. 50 వేలు ఖర్చు వచ్చింది. దుక్కి నుంచి రెండు దఫాలా పత్తి తీసే వరకు రూ. 3.88 లక్షల పెట్టుబడి వచ్చింది. దుక్కి దున్నటానికి రూ. 40 వేలు, విత్తనాలు రూ.50 వేలు, ఎరువులు రూ. 48 వేలు, చేనులో కలుపుతీత రూ. 55 వేలు, ఫెస్టిసైడ్స్ రూ. 50 వేలు, పత్తి తీసేందుకు కూలీల ఖర్చు రూ. 80 వేలు ఖర్చు వచ్చింది. భూమి కౌలు ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ. 48వేలు కౌలు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా 8 ఎకరాల పత్తి సాగుపై వచ్చిన ఖర్చు రూ. 3.86 లక్షలు కాగా 32 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ. 7800 లెక్క 32 క్వింటాలు విక్రయించిగా వచ్చిన డబ్బులు రూ. 2,49,600 మాత్రమే. దీన్ని బట్టి చూస్తే కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో సుమారు 1.80లక్షల మంది కౌలు రైతులున్నారు. వీరి జీవనం కత్తి మీది సాములా సాగుతోంది. పత్తి పంటపై ఏ కౌలు రైతును పలకరించినా ఇదే పరిస్థితి నెలకొంది.
దళారుల దోపిడీ
పంట వేసినప్పటి నుంచి అమ్ముకునేంత వరకూ ఒక పక్కన ప్రకృతి వెక్కిరింపు.. మరో పక్క ప్రభుత్వాలు విస్మరణకు గురిచేస్తున్నాయి. పండించిన పంటను విక్రయించేందుకు దళారుల చెంతకు పోతే.. మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా రైతుల పరిస్థితి నెలకొంది. అధిక తూకంతో రైతులను నట్టేటా ముంచుతున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ అధికారులు, విజిలెన్స్ అధికారులు మాత్రం మాకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దాంతో దళారులు అడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా ఉంది.
కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
పంటలకు ప్రకృతి అనుకులించక పోవడంతో రెండేండ్లుగా పంటల దిగుబడి తగ్గుతోంది. దాంతో రైతులు నష్టాలపాలయ్యారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కౌలు రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. కనీసం కూలి గిట్టక పంటలు వేసిన రైతుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కౌలు రైతులను రైతులుగా గుర్తించి సాయం అందించి వారిని ఆదుకోవాలి.
-మధుసూదన్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి
పెట్టుబడి సైతం రాలేదు
2 ఎకరాలు పత్తి సాగు చేసిన.. మొదట విత్తనాలు మొలకెత్తక రెండు, మూడు సార్లు విత్తాల్సి వచ్చింది. పంట చేతికి వచ్చే సమయానికి ఎక్కువ వర్షాలు కురిసి పంట నేలపాలైంది. రెండేండ్ల నుంచి ఇదే పరిస్థితి. గతేడాది రూ.40వేలు నష్టపోయాను. ఈ ఏడాది ఎకరానికి రూ.25 వేలు మొత్తం రూ. 50 వేలు పెట్టుబడి పెట్టగా, ప్రస్తుతం వచ్చింది రూ. 40 వేలలోపే. పెట్టిన పెట్టుబడి సైతం రాలేదు. చేసిన అప్పులు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు.
- నాగప్ప రైతు, మాడ్గుల మండలం