Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ యేడాదే కాదు... ప్రతీ ఏడాదీ నిబంధనలు అమలు చేయాలి
- 'న్యూ ఇయర్' వేడుకలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తే సరిపోతుందా..? పబ్బుల విషయంలో ఎందుకు స్పందించడం లేదు..? న్యూ ఇయర్, ఫెస్టివల్స్ జరుపుకునే విషయంలో పబ్బుల నుంచి జనానికి సమస్యలు రాకుండా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాన్ని గురు వారం నాటికి స్పష్టం చేయాలని ఆదేశించింది. తీసుకునే చర్యలు ఈ నెల 31, కొత్త ఏడాది జనవరి 1వ తేదీలకే పరిమితం చేస్తే కుదరదు, ప్రతీ ఏడాది న్యూ ఇయర్, ఇతర ముఖ్య వేడుకలకు అమలు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వు లు ఇచ్చింది. జూబ్లీహిల్స్ నివాస ప్రాంతాల్లోని పబ్బుల నిర్వహణ వల్ల ఎదురయ్యే సమస్యల నివారణకు పోలీసులు వెలువరించబోయే సూచనలు, మార్గదర్శకాలు, సర్క్యులర్‌లో స్పష్టంగా ఉండాలని చెప్పింది. పబ్బుల వల్ల శబ్దకాలుష్యం, పార్కింగ్, ట్రాఫిక్ వంటి సమస్యలు తెలెత్తుతున్నాయనీ, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని పేర్కొంటూ జూబ్లీహిల్స్ రెసిడెన్సియల్ అసోసియేషన్, ఇతరులు దాఖలు చేసిన రిట్లను బుధవారం జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి విచారించారు. 'సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాత్రి 10గంటల తర్వాత సౌండ్ పొల్యూషన్ ఉండ కూడదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఏరియాల్లో పబ్స్ ఎన్ని ఉన్నాయో తెలియని దుస్థితి నెలకొంది. నివాస ప్రాంతాల్లో పబ్బులను నిర్వహించడమే సరికాదు. యువత పెడదారి పట్ట కుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, 10, 12, 36, 45ల్లో పరిస్థితులు అందరికీ తెలిసినవే. పబ్బులు చాలా ఉన్నాయి. యువత కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాత్రిళ్లు ఇంటికి కారులో వెళ్లాలంటే పబ్బుల దగ్గర ట్రాఫిక్ జామ్స్. రోడ్లపైనే పబ్బులకు వచ్చిన వాళ్లు కార్లను పార్కింగ్ చేస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు శబ్ద కాలుష్యం ఉండరాదన్న నిబంధనలను అమలు చేసే నాథుడు లేడు. పబ్బుల వల్ల యువత పాడవ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. చట్ట ప్రకారం చర్యలు ఉండాలి. ఒకప్పుడు నివాస ప్రాంతం కాకపోవచ్చు. ఇప్పుడు నివాస ప్రాంతంగా మారింది. ఈ పరిస్థితుల్లో పబ్బుల వల్ల జనం ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి..' అని హైకోర్టు వ్యాఖ్యానించింది. సౌండ్ పొల్యూషన్ గురించి సుప్రీంకోర్టు తీర్పు అమలు కావడం లేదంటూ పిటిషనర్ల తరపు లాయర్ వాదించారు. నిద్ర లేకుండా చేస్తున్నారని చెప్పారు. సౌండ్ పొల్యూషన్ విషయంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశిస్తుందని ప్రభుత్వ ప్లీడర్ ఈ సందర్భంగా చెప్పారు.
బీపీ ఆచార్య రిట్‌పై విచారణ.. మూడుకు వాయిదా
జగన్ ఆస్తులు-లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటును సీబీఐ కోర్టు విచారించాలంటూ నిర్ణయించడం చట్ట వ్యతిరేకమని పేర్కొంటూ నిందితుడు, రిటైర్డు ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య దాఖలు చేసిన రిట్‌పై విచారణ జనవరి 3కి వాయిదా పడింది. రఘురామ్ సిమెంట్స్ కేసులో తనను సీబీఐ నిందితుడుగా పేర్కొనడంపై రిటైర్డు ఐఏఎస్ అధికారి బి.కృపానందం దాఖలు చేసిన రిట్‌పై విచారణ గురువారానికి వాయిదా పడింది. తమ కోర్టు విచారణను జాప్యం చేసేందుకే ఆచార్య రిట్ వేశారని సీబీఐ వాదించింది. ఆచార్య వాదనలను మూడున విచారిస్తామని న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు.