Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా విపత్తులో పేదలకు అండ ఎర్రజెండా
- సరళీకృత విధానాలపై సమరభేరి
- మోడీ సర్కారు తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరుబాట
- ప్రజాసమస్యలపైనా నిరంతరం ప్రతిఘటన
- టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన వైనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కష్టజీవుల వెన్నంటే కమ్యూనిస్టులున్నారు. వారికి అన్ని వేళలా బాసటగా నిలిచారు. కరోనా రెండోదశ విపత్తు సమయంలోనూ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి కరోనా రోగులకు భరోసానిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రం అందరి మన్ననలు పొందింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర చోట్ల కూడా ఐసోలేషన్ కేంద్రాలు నిర్వహించారు. ఇంకోవైపు సరళీకృత ఆర్థిక విధానాలపై సమరభేరి మోగించారు. మతోన్మాద చర్యలను ఎండగట్టారు. మోడీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు నిర్వహించారు. అందుకే ఈ దేశానికి కమ్యూనిస్టులు అవసరం అని ప్రతిపక్ష నాయకులు సైతం అంటున్నారు. కమ్యూనిజానికి మించిన సిద్ధాంతం ఈ ప్రపంచంలో మరొకటి లేదనీ, దానికి ప్రత్యామ్నాయం ఉందని ఎవరూ నిరూపించలేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అందుకే వామపక్షం... ఎప్పుడూ ప్రజాపక్షమే.
రాజ్యాంగ పరిరక్షణ కోసం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ, నియంతృత్వ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 15 నుంచి దేశవ్యాప్తంగా వినూత్న పద్ధతిలో సీపీఐ(ఎం) ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. మోడీ సర్కారు వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలు, మతోన్మాద చర్యలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఐక్య ఉద్యమాలు చేపట్టాయి. రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. రాజ్యాంగ వ్యవస్థలను మోడీ సర్కారు నిర్వీర్యం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రశ్నించే మేధావులు, రాజకీయ నాయకులపై ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను ఉసిగొల్పి దాడులు చేయడాన్ని ప్రతిఘటించాయి. కేంద్రాన్ని నిలదీసే వారిపై ఉపా వంటి చట్టాలను నమోదు చేసి దేశద్రోహం కేసులు పెట్టి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించాయి.
ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యం
ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా వామపక్ష పార్టీలు పనిచేశాయి. దుబ్బాక, హుజూర్నగర్, నాగార్జునసాగర్, జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు ఇటీవల జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చాయి. ఒకవైపు నయాఉదారవాద విధానాలు, మతోన్మాద చర్యలతో దేశానికి ఎంత ప్రమాదమో ప్రజలకు వివరించి చైతన్యపరిచాయి. బీజేపీని నిలువరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి.
రైతాంగ ఉద్యమంతో మమేకం
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలనీ, కార్మిక కోడ్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా చేపట్టిన ఉద్యమానికి వామపక్షాలు అండగా నిలిచాయి. ఆ ఉద్యమంలో మమేకం అయ్యాయి. నిరసన కార్యక్రమాలు, భారత్‌బంద్‌లు వంటి ఏ కార్యక్రమం చేపట్టినా అందులో భాగస్వామ్యమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు కృషి చేశాయి.
ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా
సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, తెలంగాణ జనసమితి (టీజేఎస్), తెలంగాణ ఇంటిపార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు. ప్రతిపక్ష పార్టీల్లో ముఖ్యంగా వామపక్ష పార్టీల్లో నూతనోత్తేజం వచ్చింది.
పోడు రైతు రాస్తారోకో
అక్టోబర్ 5న పోడు రైతులు 400 కిలోమీటర్లపాటు రాస్తారోకో చేపట్టారు. దీనిలో సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలు కూడా శక్తి మేరకు పాల్గొన్నాయి. అశ్వారావ్పేట నుంచి ఆదిలాబాద్ వరకు రోడ్లను దిగ్బంధనం చేశారు. గిరిజనులు, ఆదివాసీలు, ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉద్యమానికి దిగొచ్చింది. హక్కుపత్రాలిచ్చేందుకు పోడురైతుల నుంచి దరఖాస్తులను మాత్రమే స్వీకరించింది. వాటిని పరిశీలించి అర్హులైన వారిని గుర్తించడం, భూములను శాటిలైట్ ద్వారా చూడడం వంటి పనులను మొదలుపెట్టలేదు. దీనిపై మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టే అవకాశమున్నది.
కేంద్రాన్ని ప్రశ్నించని కేసీఆర్
యాసంగిలో వరి వేయొద్దంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వడ్లు కొనేదిలేదంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం కేసీఆర్ ప్రశ్నించడం లేదని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. బీజేపీతో టీఆర్ఎస్ లోపాయికారిగా ఒప్పందం చేసుకుందని నిలదీస్తున్నాయి. కేంద్రంపై యుద్ధం చేస్తామంటున్నారు తప్ప ఉద్యమ కార్యాచరణ రూపొందించడం లేదనీ, ప్రతిపక్ష పార్టీలను భాగస్వాములను చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. నదీజలాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయడం సరైంది కాదని సీపీఐ(ఎం) తెలిపింది. రాష్ట్రాల హక్కులను కాపాడాలని కోరింది.
ధరల పెరుగుదలపై నిరసన
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తోపాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రయివేటీరణ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేశాయి. అయినా ప్రభుత్వంలో కదలిక లేదు.
స్వతంత్రంగా సీపీఐ(ఎం) కృషి
వామపక్షాలతో కలిసి ఉమ్మడి పోరాటంలో భాగస్వామిగా ఉంటూనే ప్రజా సమస్యలపై సీపీఐ(ఎం) స్వతంత్రంగా ఉద్యమాలు చేపట్టింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్రమంతా దళితబంధును అమలు చేయాలనీ, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలనీ, పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కుపత్రాలివ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేపట్టింది. ప్రజా సమస్యలపై పోరాడేది ఎర్రజెండా... అందులోనూ ముందుండేది సీపీఐ(ఎం) అని ప్రజలే చెప్పడం గమనార్హం.