Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలి
- ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో నెంబర్ మూడును అమలు చేయాలి : సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీవో నెంబర్ 317ను ఉపసంహరించు కోవాలని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయ కులతో చర్చించి నూతన మార్గదర్శకాలను చేపట్టాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాలకు కేటాయింపు, బదిలీలు గతంలో జీవో నెంబర్ మూడు ప్రకారం జరిగేవని గుర్తుచేశారు. దాన్నే తిరిగి కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులను మనోవేదనకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత జిల్లాలోనే వారు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల బదిలీల్లో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారిందని తెలిపారు. కొత్త జిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు. ఉమ్మడి జిల్లా యూనిట్‌గా సీనియార్టీనే ప్రతిపాదికగా తీసుకుని సీనియర్లకు వారి అప్షన్ మేరకు పోస్టింగ్‌లను ఇస్తుండటంతో దాదాపు 20-30 ఏండ్లు స్థానికేతరులుగా మారుతున్నారని చెప్పారు. బదిలీల కారణంగా సొంత జిల్లాను ఉన్నఫళంగా వదిలి వెళ్లాల్సి వస్తున్నదని వివరించారు. దీంతో పదవీ విరమణ వరకు ఆ జిల్లాలోనే బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే జూనియర్ల కోసం సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలనీ, ఉపాధ్యాయుల కేటాయింపునకు కౌన్సిలింగ్ విధానాన్ని అనుసరించాలని రేవంత్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.