Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతాం
- మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధిలేదు
- ప్రజలపై భారం పెరిగింది : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య
నవతెలంగాణ-జనగామ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా ఉద్యమాలు చేపడతామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య అన్నారు. సీపీఐ(ఎం) జనగామ జిల్లా ద్వితీయ మహాసభల సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని వైష్ణవి గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాల వైఫ ల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతూ జిల్లాలో ఐక్య పోరాటాలు నిర్వహించి పేద ప్రజలు నమ్మిన సీపీఐ(ఎం) ఎర్రజెండాను ముందుకు తీసుకెళ్తామ న్నారు. ఎన్నికల ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు విస్మరించి స్వార్థ రాజకీయాల కోసం పాలన సాగిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం మంద బలంతో తీసుకునే నిర్ణయాలు దేశంలో పేద ప్రజల నడ్డివిరిచేలా ఉన్నాయన్నారు. వ్యవసాయ, పారిశ్రామికి రంగాలను ప్రయివేట్ పరం చేసి కార్పోరేట్ సంస్థలకు అప్పనంగా దోచి పెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదన్నారు. ధాన్యం కొనుగోళ్లు కేంద్రం బాధ్యత అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి ఆపద సమయంలో ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ, రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని తెలిపారు. ఏటా 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్రం నేటికి ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో లెక్క చెప్పాలన్నారు. నిరుద్యోగుల పట్ల టీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదన్నారు.
రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయంటూనే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ద్వారా నింపామని అబద్దపు మాటలు చెబుతోందని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలు దోచుకోవడంలో దొందూ దొందేనని విమర్శించారు. ఇప్పటికైనా టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి గల జనగామ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు. గ్రామస్తాయిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటాలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ బొట్ల శ్రీనివాస్, ఎదునూరి వెంకట్రాజాం, రాపర్తి రాజు, జిల్లా కమిటి సభ్యులు బూడిద గోపి, జోగు ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.